Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టిసారించాలి
- ఎస్వీకే వెబినార్‌లో వ్యవసాయ శాస్త్రవేత్త రాజిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరిధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ డి రాజిరెడ్డి తేల్చిచెప్పారు. 'యాసంగి వడ్లపై వివాదం-పరిష్కార మార్గం'అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో మంగళవారం వెబినార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి విచిత్రంగా ఉందన్నారు. ఖరీఫ్, రబీలో వరిపంట వేయడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. వర్షాలు బాగా కురవడం, భూగర్భ జలాలు పెరగడం, కొన్ని ప్రాజెక్టులు పూర్తి కావడం, ఉచిత విద్యుత్ అందించడం వంటి కారణాలతో వరి సాగుతోపాటు ధాన్యం దిగుబడి పెరిగిందని వివరించారు. యాసంగిలో వరి విస్తీర్ణాన్ని తగ్గించాలం టూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో గతంతో పోల్చితే 16 లక్షల ఎకరాల్లో సాగు చేయలేదని చెప్పారు. ప్రస్తుతం 36 లక్షల ఎకరాల్లోనే వరి సాగైందనీ, అయినా రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని అన్నారు. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న మద్దతు ధర పెట్టుబడికి ఏమాత్రం సరిపోదని చెప్పారు. పెట్టుబడి ఖర్చులో కుటుంబ శ్రమను కలపాలనీ, దానికి అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరను నిర్ణయించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులపాలు చేయకుండా ధాన్యాన్ని పూర్తిగా కొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ప్రోత్సహించాలనీ, బోనస్‌ను ప్రకటించాలని విన్నవించారు. పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, వేరుశనగ, కంది, చిరుధాన్యాలు పండించాలని సూచించారు. ఆకుకూరలు, పండ్ల తోటలు, పూలతోటలు వేయాలన్నారు. హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాల్లోనూ మార్కెట్ సౌకర్యం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాడిపరిశ్రమను అభివృద్ధి చేయాలని కోరారు. వాతావరణ సమతుల్యత, నీటి వనరులను జాగ్రత్తగా వాడాలని సూచించారు. దీర్ఘకాలిక ప్రణాళికతో రైతులు ముందుకెళ్లాలని చెప్పారు. ప్రాజెక్టులు, చెరువుల వద్ద చేపలపెంపకం చేపట్టాలని సూచించారు. రాజకీయాలకతీతంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర : సాగర్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర చేస్తున్నదని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ విమర్శించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నా వడ్లు కొనే బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూస్తున్నదని అన్నారు. కేంద్ర బడ్జెట్లో పంటల కొనుగోలుకు రూ.11 వేల కోట్లు కోత విధించిందని విమర్శించారు.
గతేడాది రూ.2.48 లక్షల కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.2.37 లక్షల కోట్లు ప్రతిపాదించిందని వివరించారు. అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామంటూ మోడీ 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏడేండ్లు దాటినా అది అమలుకు నోచుకోవడం లేదన్నారు. ధాన్యం సేకరణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వడ్లు కొనకపోతే ఆహార భద్రతకు ముప్పు వస్తుందన్నారు. వడ్లు కొనేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలను అవమానించిన కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ వ్యాఖ్యలను ఖండించారు. ఈ కార్యక్రమానికి ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.