Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీగిపోయిన యాజమాన్యం కుట్రలు
- టీబీజీకేఎస్ ద్రోహచింతనపై ఫిర్యాదు
- వేతన నష్టం రూ.16 కోట్లు
- ఉత్పత్తి నష్టం రూ.80 కోట్లు
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల విధానాలపై కార్మికవర్గం కన్నెర్ర చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన 48గంటల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రెండవ రోజూ మంగళవారం సింగరేణి గనుల్లో సంపూర్ణంగా కొనసాగింది. 26 భూగర్భ గనుల్లో అత్యవసర సిబ్బంది మినహా కార్మికులు అందరూ స్వచ్ఛందంగా విధులకు హాజరు కాలేదు. వార్షిక లక్ష్య సాధనకు సమ్మె విఘాతం కలిగిస్తుందని, కార్మికులు విధులకు హాజరయ్యే విధంగా సహకరించాలని సింగరేణి యాజమాన్యం పలు కార్మిక సంఘాల నాయకులతో జరిపిన ప్రయత్నాలు ఫలించలేదు. బీఎంఎస్, సింగరేణి గుర్తింపు యూనియన్ టీబీజీకేఎస్ అగ్రనాయకత్వం కార్మికులను బావుల్లోకి దింపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాగా ఆ సంఘాల అధినాయకత్వం తీరుపై కిందిస్థాయి నాయకులు మండిపడుతున్నారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో తక్కువ సంఖ్యలో విధులకు హాజరైన ఈపీ ఆపరేటర్ ఉద్యోగులను భారీ యంత్రాల సహాయంతో బొగ్గు ఉత్పత్తి చేయడానికి, ఉపరితలంలో నిల్వచేసిన బొగ్గును రవాణా చేయడానికి వినియోగిస్తున్నారు. ఓబీ వెలికితీత పనుల కోసం అనుమతి పొందిన కాంట్రాక్టు సంస్థలతో బొగ్గు వెలికి తీసినట్టు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సింగరేణి విస్తరించి ఉన్న రామగుండం, శ్రీరాంపూర్, కొత్తగూడెం రీజియన్‌లోని సుమారు 40వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. రెండు రోజుల సమ్మె వల్ల సంస్థకు దాదాపు రూ.80కోట్ల విలువైన మూడు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లినట్టు అంచనా. కార్మికులు వేతనాలు దాదాపు రూ.16 కోట్లు నష్టపోయినట్టు తెలుస్తోంది. కాగా, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్న సింగరేణి కార్మికులకు విప్లవ జేజేలు పలుకుతున్నామని సీఐటీయూ, ఏఐటీయూసీ,హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, టీబీజీకేఎస్ నాయకులు వేరువేరుగా వెల్లడించారు.
కేంద్రం తీరు మారాలి : సాయిబాబు, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు
కేంద్రపభుత్వం దేశాన్ని పెట్టుబడిదారులకు అమ్మి వేయడానికి చేస్తున్న ప్రయత్నాలను మానుకోవాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్.సాయిబాబు పిలుపునిచ్చారు. మంగళవారం గోదావరి ఖనిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దేశ సంపదను అంబానీ, అదానీలకు అమ్ముతున్నారన్నారు. చట్టాలను తుంగలో తొక్కి కార్మికులకు కనీస హక్కులు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఆయన వెంట సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి, నాయకులు మెండే శ్రీనివాస్, సారయ్య, నరహరి ఉన్నారు.
ముఖ్యమంత్రి మాట బేఖాతర్ : రియాజ్, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు
రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు రాష్ట్ర ముఖ్యమంత్రి మద్దతు ప్రకటించినప్పటికీ సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ సమ్మెకు తూట్లు పొడిచే ప్రయత్నాలు చేసింది. యాజమాన్య కుట్రలను ఓడించి సమ్మె విజయవంతం చేసిన కార్మికులకు విప్లవ జేజేలు.
సమ్మె విజయవంతం : సీతారామయ్య, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కార్మిక సంఘాల పిలుపుమేరకు రెండు రోజుల సమ్మె విజయవంతంగా చేసినటువంటి సింగరేణి కార్మికుల పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రయివేటీకరణ వల్ల జరుగుతున్న నష్టాన్ని గమనించిన కార్మికులు స్వచ్ఛందంగా విధులకు దూరంగా ఉన్నారు. టీబీజీకేఎస్ నాయకులు సమ్మె విచ్ఛిన్నానికి పాల్పడటం క్షమించరానిది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్‌కు టీబీజీకేఎస్ నాయకుల తీరుపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
కార్మికులకు లాల్‌సలాం : టి.శ్రీనివాస్, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు
సింగరేణిలో సమ్మె సంపూర్ణంగా నిర్వహించిన కార్మికులకు లాల్‌సలాం తెలియజేస్తున్నట్టు టి.శ్రీనివాస్, ఐ.కృష్ణ, ఈ.నరేష్ తెలిపారు.
మోడీ పద్ధతి మార్చుకో : మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కార్మిక హక్కులను, ప్రభుత్వ రంగ సంస్థలను చౌకగా పెట్టుబడిదారులకు అమ్మి వేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని మోడీ తక్షణమే విరమించుకోవాలని మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.