Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కోవిడ్ నేపథ్యంలో జీవన సవాళ్లు- పరిస్థితులు- ప్రభావాలు' అంశంపై కథనాలు పంపాలి : ప్రజాశక్తి సాహితీ సంస్థ కార్యదర్శి ఎంవీఎస్ శర్మ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాశక్తి దిన పత్రిక వ్యవస్థాపక సంపాదకులు మోటూరు హనుమంతరావు స్మృత్యర్థం పాత్రికేయ రంగంలో ఉత్తమ కృషి చేసిన జర్నలిస్టులను సత్కరించేందుకు ఎంహెచ్ స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు-2022 కోసం ఎంట్రీలకు ఆహ్వానం పలుకుతున్నామని ప్రజాశక్తి సాహితీ సంస్థ కార్యదర్శి ఎంవీఎస్ శర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 'కోవిడ్ నేపథ్యంలో జీవన సవాళ్లు-పరిస్థితులు-ప్రభావాలు' అనే అంశంపై రాసిన క్షేత్రస్థాయి కథనాలను పంపాలని సూచించారు. ఎంహెచ్ స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు నెలకొల్పి రెండు దశాబ్దాలు కావస్తున్నదని గుర్తుచేశారు. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020, 2021లో మినహా ప్రతి యేటా క్రమం తప్పకుండా పురస్కారాన్ని అందజేస్తున్నామని పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి అధ్యక్షతన నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధిపతి ప్రొఫెసర్ జి.అనిత, సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావుతో కూడిన త్రిసభ్య కమిటీ ఈ ఏడాది అవార్డు కోసం 'కోవిడ్ నేపథ్యంలో జీవన సవాళ్లు- పరిస్థితులు- ప్రభావాలు' అనే అంశంపై ఎంట్రీలను ఆహ్వానించాలని నిర్ణయించిందని తెలిపారు. కోవిడ్ ఆంక్షలు, లాక్డౌన్ల వల్ల సామాన్యులు అష్టకష్టాలు, వలస కూలీల అవస్థలు, ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక కరోనా బాధితులు ఎదుర్కొన్న ఇబ్బందులు, చివరకు దహన సంస్కారాల కోసం శ్మశాన వాటికల్లో స్థలాలు దొరక్క బాధిత కుటుంబాలు పడ్డ తిప్పలు, ప్రభుత్వాలు-వాటి పాత్రపై క్షేత్రస్థాయి పరిశీలనతో రాసిన కథనాలు పంపాలని సూచించారు. 2020 మే 1 నుంచి 2022 మే 25లోపు తెలుగు దిన పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలను మాత్రమే పంపాలనీ, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన జర్నలిస్టులు ఎంట్రీలు పంపొచ్చని తెలిపారు. ఎంట్రీతోపాటు ఇది తన సొంత రచన, ఎవరినీ అనుకరించినది కాదని స్వీయ ధ్రువీకరణ పత్రం ఒకటి జతచేసి పంపాలని సూచించారు. ఎంట్రీలు 2022 మే26 కల్లా అందేలా చూడాలని పేర్కొన్నారు. కవర్‌పై 'ఎంహెచ్ స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు-2022 కోసం' అని పేర్కొనాలని సూచించారు. జూరఎష్ట్రaషaతీసఏస్త్రఎaఱశ్రీ.షశీఎ ఈమెయిల్ ద్వారా కూడా కథనాలు పంపొచ్చని పేర్కొన్నారు. అవార్డు విజేతకు 2022 జూన్18న జరిగే ఎంహెచ్ స్మారకోపన్యాసంలో జ్ఞాపిక, రూ.10 వేలు నగదు ఇచ్చి సముచిత రీతిలో సత్కరిస్తామని తెలిపారు. ఎంట్రీలు పంపాల్సిన చిరునామా: కార్యదర్శి, ప్రజాశక్తి సాహితీ సంస్థ, ప్రజాశక్తి భవనం, అమరారెడ్డి కాలనీ, తాడేపల్లి, గుంటూరు జిల్లా, పిన్: 522501,ఇ-మెయిల్ అడ్రస్: psmhaward@gmail.com