Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నాంపల్లిలోని వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మునగాల సుధాకర్‌రెడ్డిని ఆదాయానానికి మించిన ఆస్తుల కేసులో రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీకుమార్ తెలిపిన వివరాల ప్రకారం మునగాల సుధాకర్‌రెడ్డి అక్రమాలు, , అవినీతికి పాల్పడి అక్రమాస్తులు కోట్లలో సంపాదించారని ఏసీబీకి గతంలో విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు సుధాకర్‌రెడ్డి ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులో సుధాకర్‌రెడ్డి మూడు కోట్ల 69 లక్షల రూపాయల అక్రమాస్తులను సంపాదించినట్టు ఏసీబీ విచారణలో తేలింది. ఈ మేరకు సుధాకర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ ఇచ్చిన నివేదిక మేరకు నిందితుడిని బుధవారం సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏసీబీ వలలో వ్యవసాయ శాఖ అధికారి
లంచం తీసుకుంటుండగా భద్రాద్రి కొత్తగుడెం జిల్లా జూలూరు పాడు మండలం పాప కొల్లు వ్యవసాయ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ బెజవాడ మణికంఠను ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీజీ అంజనీకుమార్ తెలిపిన వివరాల ప్రకారం జూలూరు పాడు మండలానికి చెందిన బానోతు అనే వ్యక్తి తండ్రికి చెందిన రైతు బంధు స్కీమ్ మంజూరు చేయడానికి గాను రూ. 15వేలు మణికంఠ డిమాండ్ చేశాడు. ఈ డబ్బులను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా నిందితుడిని అరెస్టు చేశారు.
ఎస్టీవో సీనియర్ అకౌంటెంట్ అరెస్టు
లంచం తీసుకుంటుండగా మెదక్ జిల్లా నర్సాపూర్ ఎస్టీవో కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ మమతను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకుని అరెస్టు చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా నివసించే మహ్మద్ అబ్దుల్ ఖాదీర్ అనే వ్యక్తి తన తల్లికి సంబంధించిన మరణానంతర బెనిఫిట్స్‌ను మంజూరు చేయాలని ఎస్టీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు నాలుగు వేల రూపాయలను మమత డిమాండ్ చేసింది. ఈ డబ్బులను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను అరెస్టు చేసి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.