Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేడబ్ల్యూడీటీ-2లో మాజీ పరిశోధకులు పళనిస్వామి
- ఏపీది సరైన విధానం కాదని వ్యాఖ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కృష్ణాబేసిన్‌లోని ఆయకట్టు తెలంగాణ అయినా, ఏపీ అయినా వానాకాలం(ఖరీఫ్) సీజన్లో తక్కువ నీటితో తక్కువ రోజుల్లో చేతికొచ్చే వరి రకాలనే సాగుచేయాలని అంతర్జాతీయ నీటి యాజమాన్య సంస్థ మాజీ ముఖ్య పరిశోధకులు ఓ పళనిస్వామి స్పష్టం చేశారు. ప్రస్తుతం కృష్ణా బేసిన్లో నీటికొరత నేపథ్యంలో ఏపీలో 155 రోజుల నిడివిగల వరి రకాలను సాగుచేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎక్కువ రోజుల్లో చేతికొచ్చే వరి రకాల సాగుతో రైతులకు పెట్టుబడి వ్యయం పెరుగుతుందనీ, నీటి కేటాయింపులు సైతం పెంచాల్సి వస్తుందని చెప్పారు. ఎక్కువ దిగుబడితో ఎక్కువ రోజుల వరి రకాలను సాగుచేస్తే ఎక్కువ నీటి వినియోగం తప్పదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న కృష్ణా జలాల వివాదా పరిష్కారాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-2) ముందు గత మూడు రోజులుగా జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా తన సాక్షమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ అడ్వకేట్ ఆర్.వెంకటరమణి, పళనిస్వామిని క్రాస్ ఎగ్జామిన్ చేశారు. అలాగే కృష్ణాబేసిన్‌లో ప్రాజెక్టుల కింద భవిష్యత్‌లో నీటి లభ్యత, కేటాయింపులు సమర్థవంతంగా జరగాలంటే నీటియాజమాన్య పద్ధతులు అనుసరించి ఆయకట్టులో పంటలసాగు ఉండాల్సిందేనని ఈ సందర్భంగా వివరించారు. ఇదే విషయమై ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) కూడా సెంట్రల్ వాటర్ కమిషన్‌కు పలు సూచనలు చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే కృష్ణాడెల్టాలో 122 రోజుల నిడివిగల వరి రకాల సాగును తాను సిఫారసు చేశానని క్రాస్ఎగ్జామినేషన్ సందర్భంగా చెప్పారు. ఏ ప్రాజెక్టు పరిధిలోనైనా నీటి కేటాయింపులపై ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆయకట్టులో పంటలసాగు సరళిని పరిశీలించాకే చేయాలని సూచిం చారు. ఈ తరుణంలో కృష్ణాబేసిన్ పరిధిలో ఆయకట్టుకు సమర్థంగా నీటికొరత లేకుండా ఉండాలంటే కృష్ణాడెల్టాలో, తెలంగాణ పరిధి ఆయకట్టులో 122 రోజుల నిడివిగల వరిసాగును ప్రోత్సహించాల్సిన అవసం ఎంతైనా ఉందని కేడబ్ల్యూడీటీ-2కి వివరించారు. పంటల మార్పిడి కూడా కీలకమేనని వ్యాఖ్యానించారు. తద్వారా భూసారం పెరుగుతుందని చెప్పారు.