Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటా మిర్చికి రూ.52,000, పత్తి రూ.11,690
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చి పంటలకు రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మిర్చి, పత్తి పంటలకు అనూహ్యమైన ధరలు దక్కాయి. ముఖ్యంగా మిర్చి పంట ధరలు పసిడిని మించిపోయాయి. బుధవారం వరంగల్ మార్కెట్లో దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.52,000 ధర పలకగా, పత్తికి క్వింటాకు రూ. 11,690 ధర పలికింది. ములుగు జిల్లా ఎస్ నగర్ గ్రామానికి చెందిన రైతు బలుగురి రాజేశ్వర్‌రావు.. ఏడు బస్తాలు దేశీ రకం మిర్చిని తీసుకురాగా హనుమాన్ ఎంటర్ప్రైజెస్ అనే ఆడ్తి ద్వారా లాలా ట్రేడింగ్ కంపెనీ ఖరీదుదారు అత్యధిక ధర రూ. 52,000 పెట్టి కొనుగోలు చేశారు. బుధవారం వరంగల్ మార్కెట్‌కు మొత్తం సుమారు 25000 మిర్చి బస్తాలు రాగా ధరలు తేజ రకంకు ధర రూ.18,600, యూఎస్341 రకం మిర్చికి ధర రూ.22,100, దేశి రూ.52,000, దీపిక రూ.23,500, సింగిల్ పట్టికి రూ.40,000 ధరలు పలికాయి. కాగా ఈ సీజన్లో మిర్చికి అత్యధిక ధర పొందిన సందర్భంగా మార్కెట్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, కార్యదర్శి రాహుల్ మిర్చి రైతు రాజేశ్వర్‌రావును సన్మానించారు.
పత్తి క్వింటాకు ధర రూ. 11,690/-
వరంగల్ మార్కెట్లో బుధవారం పత్తి క్వింటాల్‌కు ధర రూ.11, 690 పలికింది. జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం కునూరు గ్రామానికి చెందిన కుమారస్వామి అనే రైతు బుధవారం 8 బస్తాల పత్తి తీసుకురాగా నవ జ్యోతి ట్రేడింగ్ కంపెనీ ఆడ్తి ద్వారా గణపతి సాయి ట్రేడర్స్ ఖరీదుదారు అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేశారు. బుధవారం మార్కెట్‌కు సుమారు వెయ్యి పత్తి బస్తాలు వచ్చాయి.