Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 66 శాతం మంది విద్యార్థుల అభిప్రాయం: తెలంగాణ పౌరస్పందన వేదిక సర్వే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి పరీక్షలను మే 23వ తేదీ నుంచే నిర్వహించాలంటూ 66 శాతం మంది విద్యార్థులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ పౌర స్పందన వేదిక (టీపీఎస్వీ) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీఎస్వీ ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం మాట్లాడుతూ టీపీఎస్వీ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థుల పరీక్షలు మే 23 నుంచి ఉండాలా?, ఏప్రిల్ 25 నుంచి నిర్వహించాలా? అనే అంశంపై బ్యాలెట్ స్లిప్పులు అందించి సీక్రెట్ ఓటింగ్ ద్వారా సర్వే నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్‌లో 23 పాఠశాలలకు చెందిన 1,392 మంది విద్యార్థులు ఓటు వేశారని వివరించారు. ఇందులో 14 ఓట్లు చెల్లలేదు. చెల్లిన 1,378 ఓట్లలో మే 23 నుంచి పరీక్షలుండాలంటూ 909 (66 శాతం) మంది, ఏప్రిల్ 25 నుంచే ప్రారంభించాలంటూ 469 (34 శాతం) మంది విద్యార్థులు అభిప్రాయపడ్డారని అన్నారు. ఈ సర్వేలో తనతోపాటు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీపీఎస్వీ సలహాదారులు ఎంఎకె దత్తు, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మణ్‌రావు, రామకృష్ణ, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎ సమ్మద్ పాల్గొన్నారని చెప్పారు.
టీపీఎస్వీ హైదరాబాద్ జిల్లా కమిటీ ఎన్నిక
టీపీఎస్వీ హైదరాబాద్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని రాధేశ్యాం అన్నారు. నూతన అధ్యక్షులుగా వి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా ఎంఎ సమ్మద్, కోశాధికారిగా ఎస్వీ రామకృష్ణ, సహాధ్యక్షులుగా కె లక్ష్మణ్‌రావు, రామకృష్ణారావు, కార్యదర్శులుగా జి రాములు, పోసాని సుబ్బారావు, సిహెచ్ చంద్రశేఖర్‌రావు, కమిటీ సభ్యులుగా ఎస్ జితిన్, పి మస్తాన్‌రావు ఎన్నికయ్యారని చెప్పారు.