Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
- వచ్చే మూడ్రోజులు వడగాల్పులు వీచే అవకాశం
- కెరమెరిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- హైదరాబాద్‌లోనూ 40 డిగ్రీలు దాటిన వైనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. దీనికి తోడు ఉక్కపోతా పెరిగింది. దీంతో ప్రజలు ఎండవేడిమికి తాళలేక అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ రాకముందే 44 డిగ్రీలకు చేరుకున్నాయి. ఈ వారం వ్యవధిలోనే రెండు, మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లా కెరమెరిలో అత్యధికంగా 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. గతేడాది మార్చి 30తో పోల్చుకుంటే ఒక్క డిగ్రీపైగా అధిక ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం ఒక్కరోజే హైదరాబాద్ జిల్లాలో 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి 41 డిగ్రీలకు చేరింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 1.9 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 2.7 డిగ్రీలు, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 2.9 డిగ్రీలు, రామగుండం జిల్లాలో 2.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం నుంచి రాగల నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. శుక్ర, శనివారాల్లో ఉత్తర, వాయువ్య జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు వేడి తీవ్రత ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో ఎక్కువగా బయటకు వెళ్లొద్దని ఐఎమ్‌డీ ప్రజలను హెచ్చరించింది. ఓఆర్ఎస్, ద్రవపదార్థాలు, నీళ్లు ఎక్కువ తీసుకోవాలనీ, వీలైనంత మేరకు చల్లని ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండవచ్చని తెలిపింది. ఇంటీరియల్ ఒడిశా నుంచి చత్తీస్గడ్ మీదుగా తెలంగాణ వరకు సముద్ర మట్టం నుంచి 0.9 ఉపరిత ద్రోణి కొనసాగుతున్నది.
ఎండలు పెరుగుతున్నయ్.. అప్రమత్తంగా ఉండండి : సీఎస్
రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సూచించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎండలు పెరుగుతున్న క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లు, వైద్యారోగ్య, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్‌ను బుధవారం నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతోపాటు ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, పంచాయతీ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ మాణిక్ రాజ్, భారత వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న పాల్గొన్నారు.
బుధవారం నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు
కెరమెరి(కొమ్రంభీమ్ అసిఫాబాద్) 43.9 డిగ్రీలు
చాప్రాల(ఆదిలాబాద్) 43.8 డిగ్రీలు
జైనధ్(ఆదిలాబాద్) 43.8 డిగ్రీలు
కుంతాల(కొమ్రంభీమ్ అసిఫాబాద్) 43.7 డిగ్రీలు
కాటారం(జయశంకర్ భూపాలపల్లి) 43.6 డిగ్రీలు
ఆదిలాబాద్ 43.3 డిగ్రీలు
చిట్యాల(జయశంకర్ భూపాలపల్లి) 43.1 డిగ్రీలు
సిర్పూర్(పెద్దపల్లి) 43.1 డిగ్రీలు
లక్మాపూర్(నిజామాబాద్) 43.1 డిగ్రీలు