Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌన్సిల్ ఆమోదం పొందని కాలేజీలతో తంటాలు
- రిజిస్ట్రేషన్‌కు నోచుకోని వైనం... ఉద్యోగార్హత లేనట్టే
- న్యాయం చేయాలని కోరుతున్న ఫార్మాసిస్టులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయలోపం, నిర్లక్ష్యంతో ఫార్మసీ విద్యార్థులు రోడ్డున పడుతున్నారు. అందరిలాగే ఏండ్ల తరబడి చదువుకున్నా ఉద్యోగార్హత పొందలేకపోతున్నారు. రాష్ట్రంలో ఫార్మసీ కాలేజీలకు యూనివర్సిటీలు గుర్తింపునిచ్చి పరీక్షలు నిర్వహించగా, ఉత్తీర్ణత సాధించినప్పటికీ రిజిస్ట్రేషన్ వద్ద ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఆమోదం పొందితేనే ఆయా కాలేజీల నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఫార్మసీ కౌన్సిల్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేందుకు అర్హులవుతారు. అయితే విచిత్రంగా రాష్ట్రంలో తరచూ యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న కాలేజీలు చివరకు పీసీఐ ఆమోదం దక్కించుకోలేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 480 పోస్టులను ఫార్మసీ విద్యార్హత కలిగిన వారితో భర్తీ చేస్తామని ప్రకటించింది. అయితే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు హుజూరాబాద్ శాంత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజీలో బి.ఫార్మసీ చేసిన విద్యార్థులు కౌన్సిల్ వద్ద రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించారు. ఆ కాలేజీకీ పీసీఐ ఆమోదం పొందకపోవడంతో ఆ విద్యార్థుల రిజిస్ట్రేషన్ సాధ్యం కావడం లేదు. ఈ కళాశాల నుంచి 2008-12లో 60 మంది, 2009-13లో మరో 60 మంది విద్యార్థులు ఈ కళాశాల నుంచి ఫార్మసీ కోర్సును పూర్తి చేశారు. వీరికి కనీసం మెడికల్ షాపు పెట్టుకునేందుకు కూడా అర్హత లేకుండా పోయింది. ఈ కళాశాలకు జేఎన్టీయూ గుర్తింపు ఉండి పరీక్షలు కూడా నిర్వహించినప్పటికీ ఫార్మసీ కౌన్సిల్ నిబంధనల ప్రకారం లేకపోవడంతో ఆమోదం లభించలేదు. రాష్ట్రంలో 140 ఫార్మసీ కాలేజీలుండగా ప్రతి ఏడాది దాదాపు 10 వేల మంది విద్యార్థులు బయటికి వస్తున్నారు. పీసీఐ ఆమోదం కోసం ప్రతి ఏటా ప్రయత్నిస్తున్న కాలేజీలు అందుకు తగ్గట్టు బోధనా సిబ్బందినీ, సౌకర్యాలను మాత్రం సమకూర్చడం లేదు. యూనివర్సిటీ అధికారులు మొక్కుబడిగా చేస్తున్న తనిఖీలే కాలేజీలు నిబంధనలు అమలు చేయకపోవడానికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. గతంలో మహేశ్వర కాలేజీతో పాటు తార్నాకలోని మరో కాలేజీ విద్యార్థులు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
తప్పు చేయని విద్యార్థులకు శిక్షనా?..... : డాక్టర్ ఆకుల సంజయ్ రెడ్డి
ఏ తప్పు లేకున్నా బి.ఫార్మసీ చదివిన విద్యార్థును శిక్షించడం సరికాదని రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ ఆకుల సంజరు రెడ్డి అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీలు అనుమతిస్తే, ఆమోదం తెలిపేది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రమేనని తెలిపారు. నిబంధనల మేరకు సౌకర్యాలు లేకపోవడం వల్ల పీసీఐ ఆమోదం లభించని కాలేజీలకు యూనిర్సిటీలు ఎలా అనుమతినిచ్చి.... పరీక్షలు నిర్వహించాయని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపానికి విద్యార్థులను బలిచేయొద్దనీ, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.