Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాధాన్యతాక్రమంలో నెలలో పూర్తి చేయాలి
- అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మారుమూల గిరిజన గ్రామాలకూ తక్షణమే త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలనీ, ప్రాధాన్యతా క్రమంలో నెలరోజుల్లో ఆ పని పూర్తి చేయాలని కలెక్టర్లను, ఉన్నతాధికారులను రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆమె గిరిజన సంక్షేమ, అటవీ, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలు, అటవీ అనుమతులు, జాప్యం నివారణపై చర్చించారు. మూడువేలకుపైగా గుర్తించిన గ్రామాలకు ఇప్పటికే త్రీ ఫైజ్ విద్యుత్ అందిస్తున్నామని ఆమె తెలిపారు. మిగిలిన 239 గ్రామాలకు కూడా నెల రోజుల్లో పనులు పూర్తి చేసి విద్యుత్ సౌకర్యం అందిస్తామని వెల్లడించారు. జిల్లాల వారీగా అదిలాబాద్ లో 46, కొమరం భీమ్ ఆసిఫాబాద్ 98, మంచిర్యాల 26, నిర్మల్ 42, భద్రాద్రి కొత్తగూడెంలో 27 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఇంకా అందించాల్సి ఉందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అటవీ అనుమతులను వేగంగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నామనీ, అవసరమైన డాక్యుమెంటేషన్ సరైన పద్దతుల్లో పూర్తి చేస్తే ఆలస్యాన్ని నివారించవచ్చని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ చెప్పారు. గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ప్రాధాన్యత అనీ, సంబంధిత శాఖలు పూర్తి సహకారంతో పూర్తి స్థాయి విద్యుత్ సౌకర్యం ఇచ్చేందుకు కృషి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డాక్టర్ క్రిస్టీనా చోంగ్తు కోరారు. ఈ సమీక్షా సమావేశంలో అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, అదనపు పీసీసీఎఫ్ ఏ.కే.సిన్హా, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్లు, విద్యుత్ శాఖ (ఎన్.పీ.డీ.సీ.ఎల్) సీఎండీ గోపాల్ రావు, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ డైరెక్టర్లు, ఆయా జిల్లాల అధికారులు పాల్గొన్నారు.