Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడెకరాల భూమి, దళితబంధు ఇవ్వాలి
- సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చట్టాలను అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే పేదలకిచ్చిన అసైన్డ్ భూములను 'ల్యాండ్ పూలింగ్' పేరుతో బలవంతంగా లాక్కొని, ప్లాట్లు చేసి అమ్ముకోజూడటం దారుణమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కోవద్దనీ, పేదల పొట్టగొట్టే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 1956 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలైన ఓసీలకు ప్రభుత్వం వారి బతుకుదెరువు కోసం 13.88 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిందని గుర్తు చేశారు. ఈ భూములను ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుని ప్లాట్లు చేసి రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి, ప్రభుత్వ ఖజానాను నింపుకోవాలని చూడడం శోచనీయమని విమర్శించారు. ఒకవైపు దళితలకు మూడెకరాల భూమి ఇస్తామనే హామీని మరిచి, వారికి దళితబంధు పేరుతో రూ.10 లక్షలు ఇస్తామంటున్నారని వివరించారు. ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇవ్వకుండా, పేదల భూములను లాక్కోవడం సమంజసమా?అంటూ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. పట్టణాలకు దగ్గరగా అసైన్డ్ అయిన భూముల విలువ విపరీతంగా పెరిగిందని తెలిపారు. కొన్నిచోట్ల ఎకరాకు రూ.కోటికిపైగా పలుకుతున్నదని పేర్కొన్నారు. అలాంటి భూముల నుంచి పేద అసైన్డ్దారులను బలవంతంగా బయటకు పంపి ప్రభుత్వం జెండాలు, రాళ్లు పాతి లాక్కుంటున్నదని విమర్శించారు. చట్టప్రకారంగా ఇచ్చిన భూములను నిలబెట్టుకోవడానికి ప్రజలు అడ్డుకుంటుంటే వారిపైనే అక్రమ కేసులు పెట్టి, నిర్బంధం ప్రయోగిస్తున్నదని వివరించారు. ఇప్పటికీ రాష్ట్రంలో వేలాది ఎకరాల సీలింగ్ భూములు, ప్రభుత్వ బంజర్లు, ఫారెస్ట్ బంజర్లు, ఆక్రమించిన అసైన్డ్భూములు భూస్వాముల ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. వాటిని బయటికి తీసి పేదలకు పంచడం చేతగాక, వారి భూములనే లాక్కోవడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ భూములను లాక్కోవడం విడనాడి, వారి భూములు వారికే చెందేలా రక్షణ కల్పించాలని కోరారు. వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని సూచించారు. భూస్వాముల దగ్గర ఉన్న మిగులు, అక్రమంగా ఆధీనంలకున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేయాలనీ, దళితబంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు.