Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల సమర్ధతకు నిదర్శనం
- ఏప్రిల్ నుంచే కొత్త పింఛన్లు ఇస్తాం
- పట్టణ పేదరిక నిర్మూలనకు స్త్రీనిధి నడుం బిగించాలి
- దేశంలోనే అతి తక్కువ వడ్డీకే రుణాలిస్తున్న ఏకైక సంస్థ
- అభయహస్తం నిధులు తిరిగి ఇచ్చేస్తాం..పెన్షనూ ఇస్తాం..
- రూ.32 కోట్లతో మొదలై..ఇవ్వాళ రూ.5,300 కోట్లకు చేరుకున్నది :
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్త్రీనిధి మన దేశానికే ఆదర్శమనీ, దాని నిర్వహణ మహిళల సమర్ధతకు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశంసించారు. పట్టణ పేదరిక నిర్మూలనకు ఈ నిధి ద్వారా నడుం బిగించాలని సూచించారు. రూ.32 కోట్లతో ప్రారంభమైన స్త్రీనిధి నేడు రూ.5,300 కోట్లకు చేరిందని వివరించారు. దేశంలోనే అతి తక్కువ వడ్డీకే రుణాలిస్తున్న ఏకైక సంస్థ ఇదేనని కొనియాడారు. ఆనాడు తన సూచనతో ఎన్టీఆర్ ప్రారంభిస్తే దాన్ని నేడు సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. వచ్చే నెల నుంచే 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. అభయహస్తం నిధులను తిరిగి మహిళలకు ఇస్తామనీ, వాళ్లకు పెన్షన్ కూడా ఇస్తామని వెల్లడించారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో స్త్రీనిధి తొమ్మిదో సర్వసభ్య సమావేశాన్ని మంత్రి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 కోట్ల చెక్కును మంత్రికి స్త్రీనిధి అధ్యక్షులు ఇందిర, ఎమ్డీ విద్యాసాగర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పి.రాఘవాదేవి, కోశాధికారి సరస్వతి, డైరెక్టర్లు అందజేశారు. మండల, పట్టణ సమాఖ్యల కోసం రూ.47 కోట్ల చెక్కును కూడా మంత్రికి ఇచ్చారు. స్త్రీనిధి ఈసైన్, ఆన్లైన్సేవలను మంత్రి ప్రారంభించారు. వివిధ కేటగిరీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, సిబ్బందికి మంత్రి ప్రశంసాపత్రాలను, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ..స్త్రీనిధి ద్వారా ఇప్పటి వరకు 3, 97,000 మహిళా సంఘాల్లోని 26, 92,000 మంది సభ్యులకు రూ.14,339 కోట్ల రుణాలను అందజేశారని వివరించారు. ఎస్బీఐ మినహా స్త్రీనిధి తరహాలో మిగతా బ్యాంకులు రుణాలివ్వలేదని ప్రశంసించారు. మహిళలు తీసుకున్న రుణాలను పైసా ఎగ్గొట్టకుండా చెల్లిస్తారని కొనియాడారు. అందుకే బ్యాంకులు ఎలాంటి షూరిటీ లేకున్నా మహిళా సంఘాలు సులువుగా రుణాలిస్తాయన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలు ఐదు నుంచి పదెకరాలు లీజుకు తీసుకుని కూరగాయలు పడించాలనీ, సీజనల్ వారీగా పండ్ల, ఇతర వ్యాపారాలు చేస్తూ మహిళా సంఘాలే ఓ పది మందికి ఉద్యోగవకాశాలు కల్పించే స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. స్త్రీనిధి కమిటీ కాలాన్ని రెండేండ్లకు పెంచే, ప్రత్యేక భవనాన్ని నిర్మించే అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. స్త్రీనిధిని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడానికి సభ్యులందరూ కషి చేయాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి, పేదరిక నిర్మూలనా సంస్థ సీఈఓ సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్నారన్నారు. ప్రతిసారీ ప్రభుత్వమే సాయం అందించాలనే ఆలోచనలో ఉండొద్దనీ, సొంత కాళ్లపై ఎదిగేందుకు మహిళా సంఘాలు ప్రయత్నించాలని సూచించారు. ఒక ఏడాదిలోనే 70 వేల యూనిట్లు గ్రౌండ్ చేయగలిగామనీ. మహిళలు ఎంతో ఉత్సాహంగా, క్రమశిక్షణతో పని చేస్తున్నారని ప్రశంసించారు. త్వరలోనే సంస్థలో ఉద్యోగుల కొరతను తీరుస్తామని హామీనిచ్చారు. మెప్మా ఎమ్డీ సత్యనారాయణ మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలనకు స్త్రీనిధి నడుం బిగించాలని కోరారు. కేవలం 11 శాతం వడ్డీకే రుణాలిస్తున్నామనీ, డిపాజిట్లకు కూడా మిగతా బ్యాంకుల కంటే ఎక్కువ శాతం వడ్డీ ఇస్తున్నామని వివరించారు. 2021 ఏడాదికి ఉత్తమ సంస్థగా స్త్రీ నిధి అవార్డు తీసుకోబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ..దరఖాస్తు పెట్టుకున్న 48 గంటల్లోనే రుణాలు ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మన స్త్రీనిధిని అభినందించిందనీ, ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించిందని గుర్తుచేశారు. స్త్రీనిధి సలహాదారు టీసీఎస్ రెడ్డి మాట్లాడుతూ..స్త్రీనిధి నిజంగానే పేదల పెన్నిధి అనీ, సంస్థకు ప్రభుత్వ సహకారం చాలా బాగుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్త్రీనిధి 19 మంది డైరెక్టర్లు, 600 మంది మండల, పట్టణ సమాఖ్యల అధ్యక్షులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.