Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకులకు సైబర్ ముప్పు
- సాఫ్ట్వేర్ ప్రొవైడర్‌పై అనుమానం
- నిందితులను పట్టుకోవడానికి ఇంటర్‌పోల్ సాయం : సీపీ సీవీ ఆనంద్
నవతెలంగాణ- సిటీబ్యూరో
'బ్యాంకులకు సైబర్ ముప్పు పొంది. సైబర్ సెక్యూరిటీపై మహేష్‌బ్యాంకు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోంది. ఆర్బీఐ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు. ఈ బ్యాంకు సాఫ్ట్వేర్ ప్రొవైడర్ ఇన్ఫ్రాసాఫ్ట్పై అనుమానాలు ఉన్నాయి. నిందితులు ఎక్కడ ఉన్నారో ఆచూకీ లేదు. వాళ్లను పట్టుకోవడానికి ఇంటర్‌పోల్ సాయం తీసుకుంటాం. ఈ కేసును విచారించడానికి టీఏ, డీఏల కోసం ఇప్పటి వరకు రూ.58 లక్షలు అయింది' అని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం సిటీ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మహేశ్‌బ్యాంక్ హ్యాకింగ్‌పై వివరించారు. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులోనూ రూ.1.90 కోట్ల కుంభకోణానికి మహేశ్ బ్యాంకు సంఘటనకు లింకు ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. మహేశ్ బ్యాంకులో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులకు హ్యాకర్స్ లింకు పంపించారని, వీరిలో ఇద్దరు లింకు ఓపెన్ చేయడంతో బ్యాంకుకు సంబంధించిన వివరాలన్నీ హ్యాకర్ చేతిలోకెళ్లాయని తెలిపారు. దీంతో బ్యాంకు అధికారులు ఏపని చేసినా హ్యాకర్లు నేరుగా చూస్తారని చెప్పారు. ఏ బ్యాంకులోనైనా మాస్టర్ అడ్మిన్స్ ఇద్దరు మాత్రమే ఉంటారని, ఇక్కడ మాత్రం 10మంది ఉన్నారని అన్నారు. వీరందరికీ కామన్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉండటంతోపాటు సింగిల్ నెట్వర్క్, లోకల్ ఏరియా కనెక్షన్ ఒకటే ఉండటంతో సులభంగా హ్యాకింగ్ జరిగిందన్నారు. బ్యాంకుల సాఫ్ట్వేర్ స్ట్రాంగ్ఫైర్వాల్స్, ఇంట్రోజెన్ ప్రివెంటీవ్ సిస్టం ఉండాలని, కానీ మహేశ్ బ్యాంకులో ఇవేవీ లేకపోవడంతో హ్యాకింగ్ జరిగిందని అన్నారు.
రూ.10 లక్షలతో ముంబయికి చెందిన ఇన్ఫ్రాసాఫ్ట్ కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చిందని, ఇది నాసిరకంగా ఉందని తెలిపారు. మహేశ్ బ్యాంకులో రూ.12.48 కోట్లు కొల్లగొట్టడానికి నాలుగు ఫేక్ అకౌంట్లను సృష్టించారని, వీటిలో సాన్విక ఎంటర్ప్రైజెస్ ద్వారా రూ.4,00,40,361, షహనాజ్‌బేగం అకౌంట్ ద్వారా రూ.3,59, 55,390, హిందూస్తాన్ ట్రేడర్స్ (వినోద్రాటి) ద్వారా 4,83,25,985, సంపత్‌కుమార్ ద్వారా 4,99,999 కాజేశారని తెలిపారు. ఈ నాలుగు అకౌంట్ల ద్వారా దేశవ్యాప్తంగా ఢిల్లీ, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, వెస్ట్‌బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 115 వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి మరో 398 అకౌంట్లను సృష్టించారని వివరించారు. షహనాజ్‌బేగం అనే వ్యక్తికి గోల్కొండలో సొంతిల్లు ఉందని, ఆమె ఎక్కువగా ముంబయిలో ఉంటున్నట్టు తెలిసిందని అన్నారు. సంపత్‌కుమార్‌ను స్టీఫెన్ఒరీ కలిసి బ్యాంకు లావాదేవీలు చేశారని, అందుకు సంపత్‌కుమార్‌కు రూ.5లక్షల కమీషన్ ఇచ్చారని, లబ్దిదారుని వివరాలు సరిగ్గా లేకపోవడంతో ఒర్జీకి మనీ ట్రాన్స్ఫర్ కాలేదని అన్నారు. బ్యాంకుల నిబంధనలపై ఆర్బీఐ నుంచి ఎన్ఫోర్స్మెంట్ లేదని, ఈ విషయంపై బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తామని తెలిపారు. హ్యాంకింగ్ విషయంలో ప్రధాన నిందితుడికి సహకరించిన స్టీఫెన్ ఒర్జి అనే వ్యక్తిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులకు ప్రశంస పత్రాలు ఇస్తామని సీపీ తెలిపారు. ఆర్టీజీఎస్, నెఫ్ట్, నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.