Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వస్త్ర పరిశ్రమకు ఉచిత కరెంట్ ఇవ్వాలి..
- సమ్మెకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు: రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్ బాబు
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
కూలి రేట్లు పెంచాలని, ఇతర డిమాండ్స్ పరిష్కరించాలని పది రోజులుగా మండుటెండలో కార్మికులు పోరాడుతుంటే.. నేతన్నల పెద్దకొడుకునని ఎన్నికల ముందు కపట ప్రేమ వలకబోసిన పెద్దమనిషెక్కడ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్ బాబు ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పవర్లూమ్ కార్మికులు, ఆసాములు సీఐటీయూ ఆధ్వర్యంలో పది రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు బుధవారం సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టిన కార్మికులతో నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా టి.స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. ఐదేండ్లుగా నయాపైసా కూలి పెంచకుండా ఇబ్బందులు పెట్టారని తెలిపారు. దీంతో నిత్యం పెరుగుతున్న నిత్యావసర ధరలతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కార్మికులు మండుటెండలో తమకు కూలి పెంచాలని పోరాడుతుంటే మంత్రి పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సుమారు రూ.30 కోట్ల యారన్ సబ్సిడీ బకాయి విడుదల చేయాల్సి ఉందన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన మాదిరిగానే వస్త్ర పరిశ్రమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే కార్మికులు, ఆసాములతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలన్నారు. పాదయాత్ర ప్రారంభించి నేతన్న విగ్రహం వరకు చేరుకోగానే యజమానులు చర్చలకు అహ్వానించడంతో పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, ఆసాముల సంఘం నాయకులు చేరాల అశోక్, సిరిసిల్ల రవీందర్, వార్పిన్ వర్కర్స్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరికుంట కిషన్, పవర్లూమ్ కార్మికులు వార్పిన్, వైపని కార్మికులు పాల్గొన్నారు.