Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి గిరిజన సంఘాల రౌండ్‌టేబుల్ తీర్మానం
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం పది శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలనీ, అమలులో న్యాయపర సమస్యలు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం దాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని గిరిజన సంఘం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. బుధవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ''గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు - ఐక్క ఉద్యమ కార్యాచరణ' పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ.. గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుతం అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందని విమర్శించారు. కేంద్రం గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి అధికారికంగా ప్రకటిస్తే రాష్ట్రం ఆ రిజర్వేషన్లు అమలు చేసేవరకు అమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. గిరిజన సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి రిజర్వేషన్ల కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమించాలని, తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ..టికెట్లకు ఆశ పడకుండా జాతి కోసం నాయకులు కొట్లాడితేనే హక్కులు వస్తాయని నొక్కిచెప్పారు. 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వచ్చే నెల 2నుంచి 10వరకు అన్ని తండాల్లో, గూడేల్లో నగారా మోగించాలని పిలుపునిచ్చారు. గిరిజనులు రాజ్యాధికారం సాధించే దిశగా సంఘాలన్నీ ఐక్యమత్యంగా పోరాడాలని నొక్కిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితే సీఎం కేసీఆర్ దిగివస్తారని చెప్పారు. ఆదివాసీ గిరిజన సంఘం ఉపాధ్యక్షుడు బండారు రవి కుమార్ మాట్లాడుతూ..గిరిజన రిజర్వేషన్ల అంశం బీజేపీ, టీఆర్ఎస్ తగాదాగా మారకూడదన్నారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల అంశంపై హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలనీ, కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్దకు అఖిలపక్ష నాయకులను తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు గిరిజనులను మోసం చేస్తున్నాయనీ, ఆరెండు పార్టీలను గిరిజనులు క్షమించబోరని హెచ్చరించారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్ మాట్లాడుతూ..లంబాడీలు, గోండులకు మధ్య తగువబెట్టి పాలకులు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ డ్రామాలు ఆపి వెంటనే రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐక్యంగా పోరాడితేనే రిజర్వేషన్లు తెచ్చుకోవడం సాధ్యమని నొక్కిచెప్పారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ మాట్లాడుతూ..న్యాయంగా రిజర్వేషన్లు సాధించుకునే సత్తా గిరిజన సంఘాలకు ఉందన్నారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని చెబుతూ కేంద్రం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. పది శాతం రిజర్వేషన్ల సాధన కోసం గిరిజన జేఏసీ ఏర్పాటుచేసి ఐక్యంగా ఉద్యమించాలనీ, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఓయూ విద్యార్ధి సంఘం నేత అశోక్ నాయక్ మాట్లాడుతూ, గిరిజనులతో ఇతర కులాలను కలపకుండా రిజర్వేషన్లు పెంచుతూ మళ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. జీవీఎస్ అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ..ఉద్యోగ నోటిఫికేషన్ల కంటే ముందుగానే గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లంబాడ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ నాయక్ మాట్లాడుతూ..గిరిజనులు, ముస్లింలను కలిపి రిజర్వేషన్లు పెంచి తీర్మానం చేయడం కేసీఆర్ రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. ఓట్ల కోసం ఆడిన రాజకీయ నాటకమని విమర్శించారు. రిజర్వేషన్లు అమలు చేయకపోతే టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఎరుకల సంఘం నేత ప్రభాకర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్ధిక, సంస్కృతిక రంగాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓయూ జేఏసీ నేత రవి నాయక్ మాట్లాడుతూ, రిజర్వేషన్లు ఇస్తా అన్నోడి పైనే పోరాటం చేయాలన్నారు. సేవాలాల్ సేన నేత రాంబాబు మాట్లాడుతూ,గిరిజన సంఘాలు ఐకమత్యంగా పోరాడితేనే రిజర్వేషన్లు సాధించుకోగలమని చెప్పారు. ట్రైబల్ మేధావుల ఫోరం ప్రతినిధి ధనుంజరు మాట్లాడుతూ, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంపైనే పోరాటం చేయాలన్నారు. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నాయకులు ఉషా కిరణ్, రాజ్ కుమార్, అంజయ్య నాయక్ మాట్లాడుతూ, జనాభా దామాషా ప్రకారం గిరిజన రిజర్వేషన్లు అమలు చేసేలా ఐకమత్యంగా పోరాటం చేయాలని కోరారు. దాసురాం నాయక్ మాట్లాడుతూ, రాజ్యాంగ వ్యతిరేకంగా పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్న ప్రభుత్వాలు..గిరిజనులకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలుచేయాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నా పట్టించుకోవడంలేదన్నారు.