Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపౌరుడూ భారత రాజ్యాంగాన్ని చదవాలి
- ప్రతిజ్ఞ చేయాలి
- టీపీఎస్కే రాష్ట్ర నాయకులు జి. రాములు
నవతెలంగాణ-ముషీరాబాద్
పంచాంగ శ్రావణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న అని, ప్రతి పౌరుడూ బాధ్యతగా రాజ్యాంగాన్ని పఠించాలని టీపీఎస్కే రాష్ట్ర నాయకులు జి.రాములు పిలుపునిచ్చారు. 70 ఏండ్ల రాజ్యాంగంపై మనువాదుల దాడి మొదలైందని, రాజ్యాంగ పరిరక్షణకోసం పౌరులు ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్కే) ఆధ్వర్యంలో ''పంచాంగ శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న'' అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాములు మాట్లాడుతూ.. సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం కొనసాగలేదని, సామాజిక ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాన్ని జీవన సూత్రాలను గుర్తించే జీవన పద్ధతి అని అన్నారు. 'స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం' వీటిలో ఏ ఒక్క దాన్ని వేరు చేసినా ప్రజాస్వామ్యం దెబ్బతింటుందన్నారు. 70 ఏండ్ల రాజ్యాంగంపై మనువాద పాలకుల దాడి ప్రారంభమైందని, దాని పరిరక్షణ కోసం ప్రతి ఒక్క పౌరుడూ పూనుకోవాలని కోరారు. ''పంచాంగ శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం'' అంటూ రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగంపై ప్రతి పౌరుడు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం టీపీఎస్కే రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వర్లు భారత రాజ్యాంగ పీఠిక చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. టీపీఎస్కే రాష్ట్ర నాయకులు ఎంవీ రమణ జి.నరేష్, గిరిజన సంఘం నాయకులు ధర్మ నాయక్, తదితరులు పాల్గొన్నారు.