Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెగుళ్లుసోకి ఎండిపోయిన చెట్లు
- కనిపించని పువ్వు
- వేపను రక్షించాలంటున్న ప్రజలు
నవతెలంగాణ - మీర్పేట్
ఉగాది పండుగ సమయానికి ఎక్కడ చూసినా వేప చెట్లు పచ్చటి ఆకులతో తెల్లటి పువ్వులతో కళకళలాడుతూ ఉండేవి.. ప్రకృతి వైపరీత్యమో, మానవ తప్పిదమో ఈసారి తెగుళ్లు సోకి వేప చెట్లు ఎండిపోయాయి. కొత్త ఆకు కనిపించడం లేదు.. ఉన్నా అంతా నల్లటి తెగులు సోకింది. రాష్ట్ర వ్యాప్తంగాతోపాటు హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో ఎక్కడా వేపచెట్లకు పువ్వు కనిపించటం లేదు. దీంతో ఈ ఉగాది పండుగకు షడ్రుచుల పచ్చడిలో చేదు కోసం వాడే వేప పువ్వు మిస్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఎక్కడా కొద్దిపాటి వేప పువ్వు లభించినా.. తెగులు సోకిన చెట్ల పువ్వును వాడటానికి ప్రజలు భయపడుతున్నారు.
ఉగాది పచ్చడిలో షడ్రుచులు తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదులను కలిపి పచ్చడి తయారు చేస్తారు. తెలుగు సంవత్సరాది మొదటి పండుగ ఉగాది. దీని ప్రత్యేకత షడ్రుచులు కలిగిన పచ్చడి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన పండుగ. ఈ పండుగకు పచ్చడిలో వేసే ప్రధానమైన చేదు కల్గిన వేప పువ్వు లేకుండా పచ్చడిని ఊహించలేం.. పచ్చని ఆకులతో కళకళలాడే వేప చెట్లు ఎండిపోయి, మోడుబారి దర్శనమిస్తున్నాయి.
వేపలో ఔషధ గుణాలు ఎన్నో ..
వేప సర్వరోగ నివారిణి.. పర్యావరణ హితకారిణి.. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆకులు, కాండం, వేర్లు, పూత, పండ్లు, గింజలు, వేప చెట్టు నుంచి వచ్చే నీరా(కల్లు) వంటివి అన్ని ఔషధ గుణాలు కలిగి ఉండేవే. వీటిని మందుల తయారీలో ఉపయోగిస్తారు. వ్యవసాయ పొలాల్లో ఎక్కువగా దిగుబడి రావడం కోసం వేపను సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తారు. వేప ఆకులను చాలా వ్యాధుల నివారణకు వాడుతారు. పూర్వపు రోజుల్లో ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టును పెంచడానికి కారణం వేపలో మెండుగా ఔషధ గుణాలు ఉండటంతోపాటుగా పరిసర ప్రాంతాలు చల్లగా ఉండటమే. వేప కొమ్మలు, ఆకులు ప్రజలు ఇండ్లకు తోరణాలుగా కడుతుంటారు. తెలుగు ప్రజల జీవనశైలిలో వేపకు చాలా ప్రాధాన్యత ఉంది. వేపచెట్లు ఎండిపోకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యవసాయ, పర్యావరణ నిపుణులు, ప్రజలు కోరుతున్నారు.