Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 శాతం కంటే ఎక్కువగా పెరిగిన వైనం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పెరిగిన కరెంటు చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. 14 శాతం మేరకు చార్జీలు పెంచామని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) చెప్తున్నా, పెరిగిన యూనిట్ రేట్లు, కష్టమర్ చార్జీలు అంతకంటే ఎక్కువే ఉండబోతున్నాయి. ఈ ఎఫెక్ట్ మే మొదటి వారంలో ఇండ్లకు వచ్చే కరెంటు బిల్లుల్లో కనిపిస్తుంది. నడి వేసవి...ఎండలు మండుతున్నాయి...24/7 కరెంటు ఉంది కదా అని ఫ్యాన్లు, ఏసీలు ఆన్‌చేసి, వాడేసుకుంటే మే మొదటి వారంలో వచ్చే బిల్లులో ఆ 'లగ్జరీ లైఫ్'కు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కరెంటు నియంత్రణ వినియోగదారుల చేతుల్లోనే ఉంది. తాజాగా పెంచిన టారిఫ్‌లో 0-50 యూనిట్ల శ్లాబ్ ధరను కూడా పెంచిన విషయం తెలిసిందే.
- పాత టారిఫ్ ప్రకారం 50 యూనిట్లు వినియోగం జరిగితే వచ్చే కరెంటు బిల్లు రూ.97.50 పైసలు. కొత్త టారిఫ్ ప్రకారం అదే 50 యూనిట్లకు రూ.150.50పైసలు బిల్లు వస్తుంది. రూ.53 అదనంగా భారం పడుతుంది.
- పాత టారిఫ్‌లో వంద యూనిట్లు వాడితే రూ.232.50 పైసలు బిల్లు వచ్చేది. కొత్త టారిఫ్‌లో పెరిగిన చార్జీల ప్రకారం అదే వంద యూనిట్లకు బిల్లు రూ.396 వస్తుంది. అంటే పెరిగే భారం రూ.163.50 పైసలు.
- పాత టారిఫ్‌లో 200 యూనిట్లు వాడితే వచ్చే కరెంటు బిల్లు రూ.810. పెరిగిన చార్జీల ప్రకారం మే నెలలో వచ్చే బిల్లు అదే 200 యూనిట్లకు రూ. 1,120 వస్తుంది. పెరిగే మొత్తం రూ.310.
- ఇలాగే అన్ని కేటగిరిలు, శ్లాబుల్లోనూ కరెంటు బిల్లులు భారీగా పెరిగాయి. వినియోగించిన కరెంటు యూనిట్లకు అదనంగా ఫిక్సెడ్ చార్జీలు, కష్టమర్ చార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఉంటాయి. వీటిలో గృహ వినియోగదా రులకు కొత్తగా ఫిక్సెడ్ చార్జీలను విధించారు. కష్టమర్ చార్జీలు గతంలో రూ.25 ఉంటే దానికి రూ.15 పెంచి రూ.40 చేశారు. ఇవే చార్జీలను కొన్ని కేటగిరిల్లో వందశాతం పెంచేశారు. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు అదనంగా పెంచేశారు. చిన్న చిన్న దుకాణాలు వగైరా కమర్షియల్ కనెక్షన్లకు రూ.1 చొప్పున పెంచారు. దీనికి పై చార్జీలు అదనమే. అందువల్ల ఎండాకాలం ఉక్కపోత కావాలో, సుఖవంతమైన ఫ్యాన్ గాలి కావాలో తేల్చుకోవాల్సింది వినియోగదారులే!