Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులను కోరిన ఈడీ
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు సాగిస్తున్న ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దర్యాప్తులో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు సహకరించడం లేదనే అసహనంతో ఉన్నారని తెలిసింది. ఈ కేసు దర్యాప్తులో అవసరమైన ఆధారాలను అందించడంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన సహకారాన్ని అందిస్తారని భావించిన ఈడీ అధికారులకు తాము కోరిన నిందితుల కాల్ డేటా ఇవ్వడం లేదనే గుర్రుగా ఉన్నారు. కొద్ది నెలల క్రితం రాష్ట్రంలో డ్రగ్స్ కేసులో పలువురు టాలీవుడ్ నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ తో సహా మరో నలుగురి నుంచి అనేక ఆధారాలను ఎక్సైజ్ శాఖ అధికారులు సేకరించారు. ముఖ్యంగా వీరి ద్వారా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా జరిగింది, ఎవరెవరు కొన్నారు, ఎవరి నుంచి వీరికి డ్రగ్స్ అందాయి.ఇలా పలువురి కాల్ డేటాను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు సేకరించారని ఈడీ అనుమానిస్తోంది. అలాగే పలువురు నిందితుల సెటిల్మెంట్లను కూడా వీడియో రికార్డు చేసిందని భావిస్తోంది. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ కేసులో నిందితులు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఇచ్చిన క్లూ ఆధారంగానే ఈడీ అధికారులు కేసు దర్యాప్తునకు దిగారు. అందులో భాగంగా ఈడీ అధికారులు సైతం ఎక్సైజ్ శాఖ అధికారులు విచారించిన కొందరు సినీనటులను కూడా విచారించారు. అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులు విచారించిన కొందరు సినీ నటులను కూడా ఈడీ విచారించింది. కేసు పురోగతిలో భాగంగా ఎక్సైజ్ శాఖ అధికారులు కెల్విన్ తదితర నిందితుల నుంచి సేకరించిన కాల్ డేటాను ఇవ్వాలని ఈడీ కోరింది. అయితే కాల్ డేటా తమ వద్ద లేదని తాము సేకరించిన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఇంకా కాల్ డేటాను సేకరించలేదని , ఆ సాంకేతిక ఆధారాలన్నింటిని కోర్టుకు సమర్పించామని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నట్టు తెలిసింది. అయితే ఆ శాఖ అధికారుల వద్ద నిందితుల కాల్ డేటా ఉందని విశ్వసిస్తున్న ఈడీ అధికారులు వీటిని ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన కోర్టు ధిక్కారం కేసును కూడా నమోదు చేశారని సమాచారం. మొత్తం మీద ఎక్సైజ్ శాఖ అధికారుల నుంచి నిందితుల కాల్ డేటాను తీసుకుంటేనే కేసు ముందుకు సాగుతుందని ఈడీ అధికారులు వాదిస్తున్నారు. ఈ విషయంలో కోర్టు నుంచి వచ్చే ఆదేశాలు శిరోధార్యమని భావిస్తున్న ఈడీ అధికారులు మరో వైపు నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులపై వత్తిడిని పెంచారని తెలిసింది.