Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్హెచ్ఏఐ అధికారుల సమాలోచనలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు మార్చనున్న రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్)ఉత్తర భాగానికి సంబంధించి తొలి నోటిఫికేషన్ (3ఏ) గెజిట్‌కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదముద్ర వేసినట్టు తెలిసింది.ఇప్పటికే ఉత్తరభాగానికి సంబంధించిన తుది అలైన్‌మెంటు మ్యాపును కూడా జాతీయ రహదారుల విభాగం అధికారులు,రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదింపుల అనంతరం సిద్ధం చేసిన విషయం విదితమే.నాలుగు జిల్లాల పరిధిలోని 15మండలాలకు సంబంధించి 113గ్రామాల మీదుగా ఈ ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులు చెబుతున్నారు. ఇందుకు మొత్తం4704 ఎకరాల భూమి అవసరమని గెజిట్‌లో పొందుపరిచినట్టు సమాచారం.
నాలుగు జిల్లాలు..15 మండలాలు
రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి,మెదక్,సిద్దిపేట జిల్లాల పరిధిలో నిర్మితం కానున్నది.ఈ నాలుగు జిల్లాల పరిధిలోని 15మండలాలను అనుసంధానిస్తూ రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) రూపుదిద్దుకుంటు ందని ఎన్హెచ్ఏఐ అంటున్నది. కానీ, అధికారికంగా గెజిట్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. స్థానిక ఉన్నతాధికారులు పంపిన ప్రతిపాదనల ప్రకారం సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి, చౌటకూరు, హత్నూరు మండలాలు,మెదక్ జిల్లా పరిధిలోని నర్సాపూర్,శివంపేట,తూప్రాన్ మండలాలు, సిద్దిపే ట జిల్లా పరిధిలోని గజ్వేల్,వర్గల్, మర్కూక్, జగదేవ్‌పూర్ మండలాలు,యాదాద్రి జిల్లా పరిధిలోని తుర్కపల్లి, యాదాద్రి, భువనగిరి, వలిగొండ,చౌటుప్ప ల్ మండలాలు దీని పరిధిలోకి రానున్నాయి.ఆర్డీఓ పరిధిని యూనిట్‌గా చేసుకుని గ్రామాలు,మండలాల వివరాలు గెజిట్‌లో పొందుపరిచినట్టు అధికారిక సమాచారం. అయితే, గ్రామాల సంఖ్యపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. గెజిట్‌లో ప్రతిపాదించిన 113 గ్రామాలు ఉంటాయా? కొన్నింటిని తీసివేస్తారా ? అన్నది తేలాల్సి ఉందని పేరు రాయడానికి ఇష్టపడని అధికారులు చెబుతున్నారు.