Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
- చిరిగిపోయిన సదానందంగౌడ్ అంగీ
- టీచర్ల అప్పీళ్లు పరిష్కారమయ్యే వరకు పోరాటం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవో వల్ల ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణరాష్ట్రం (ఎస్టీయూటీఎస్) పాఠశాల విద్యాశాఖ సంచాలకులు (డీఎస్ఈ) కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అప్పటికే పెద్దఎత్తున అక్కడ మోహరించారు. ఎస్టీయూటీఎస్ నాయకులు, కార్యకర్తలు, పలువురు ఉపాధ్యాయులు అక్కడికి చేరుకోగానే పోలీసులు వారిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సమయంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 'ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, 317 జీవో అన్ని రకాల అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలి, స్పౌజ్ బదిలీలు చేపట్టాలి 'అంటూ పెద్దఎత్తున నినాదాలు చేయడంతోపాటు ఫ్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అరెస్టు చేసే సమయంలో ఎస్టీయూటీఎస్ అధ్యక్షులు జి సదానందంగౌడ్ అంగీ చిరిగిపోయింది. ఆయన అలాగే సాయంత్రం వరకు నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారు. అంతకుముందు సదానందంగౌడ్, ఎస్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తామంటే పోలీసులు అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉపాధ్యాయుల అప్పీళ్లు, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికైనా స్పందించి 317 జీవో అప్పీళ్ల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. 317 జీవో స్పౌజ్ అభ్యర్థులను అన్ని జిల్లాలకూ అనుమతించాలని కోరారు. హైకోర్టు తీర్పుననుసరించి ఒంటరి మహిళలు, వితంతువుల అప్పీళ్లను పరిష్కరించాలని చెప్పారు. సీనియార్టీలో దొర్లిన తప్పులను సరిచేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవో మెడికల్ గ్రౌండ్స్ అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. వేసవిలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎవి సుధాకర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఇఫ్తైఆరుద్దీన్, నాయకులు పోల్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పోచయ్య, ఈశ్వర్, ప్రవీణ్‌కుమార్, బి వెంకటేశ్వర్లు, సాబేర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.