Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దతు ధరలకే వరి కొనుగోలు చేయాలి :రైతుసంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద వైఖరిని విడనాడాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ సూచించారు. ధాన్యం కొనుగోళ్లను మద్దతు ధరలకే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పుడు బియ్యం కొనలేమంటూ కేంద్ర ప్రభుత్వ ప్రకటించడం సరైందికాదన్నారు. కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవమానకరంగా మాట్లాడారనీ, ఈ చర్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశమైంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకరావాలని సూచించారు. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నదని గుర్తు చేశారు. రాష్ట్రంలోనూ అదేవిధంగా కొనుగోలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దని ప్రకటించడంతో రైతులు ఆ పంటను తగ్గించినట్టు కనిపిస్తున్నదని చెప్పారు. ఈ పంటను కొనేందుకు కూడా ప్రభుత్వం వెనకాడుతున్నదని విమర్శించారు. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ వరి విషయాన్ని రాజకీయ దృష్టి కోణంలోనే చూస్తున్నాయని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఆచరణలో ఆ హామీకి తిలోదకాలు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేరళ తరహాలో బోనస్ ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. రైతుల సమస్యను పట్టించుకోకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పెసరగాయల జంగారెడ్డి, అరిబండి ప్రసాదరావు, మహిళా రైతుల రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, నాయకులు అలివేలు, నాగలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.