Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ చార్జీల పెంపుపై ఆగ్రహం
- దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిరసన చేపట్టారు. సిలిండర్లకు మోడీ బొమ్మలు, పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో పేదలు బతుకలేని పరిస్థితి ఏర్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్లు ఎత్తుకొని ర్యాలీ చేపట్టారు. కామేపల్లిలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విద్యుత్ శాఖ ఏడీకి వినతి పత్రం అందజేశారు. చింతకాని మండలం పాతర్లపాడులో జరిగిన నిరసన కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్, విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బస్టాండ్ సెంటర్లో నిరసన తెలిపారు. ములకలిపల్లిలో గ్యాస్ సిలిండర్లకు ప్రధాని మోడీ చిత్ర పటాన్ని పెట్టి రిక్షాపై ఊరేగింపు నిర్వహించారు. ఇల్లందులో మహిళలు, మణుగూరులో గ్యాస్ సిలిండర్లు పూల మాలవేసి నిరసన తెలిపారు. భద్రాచలంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లు ఎత్తుకొని నిరసన తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట డీసీసీబీ అధ్యక్షులు ఓబెదుల్లా కోత్వాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. అలాగే, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నిరసనలు తెలిపారు.
యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిలిండర్లకు పూలదండ వేసి నిరసన తెలిపారు. ఆలేరు పట్టణ కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్లకు పూలదండ వేశారు. నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి, నకిరేకల్‌లో గురువారం నిరసన తెలిపారు. రాస్తారోకో చేసి గ్యాస్ సిలిండర్లతో ధర్నా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
హైదరాబాద్ బోడుప్పల్, పీర్జాదిగూడ జంట కార్పొరేషన్ల పరిధిలో నిరసనలు కొనసాగాయి. సిలిండర్ నెత్తిన పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ''మోడీ కేడీ జోడి - గడిచేదెలా గరీబోణి బండి'' అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అల్వాల్, నేరేడ్మెట్ పరిధిలో నిరసనలు కొనసాగాయి. అంబేద్కర్ నగర్ కాలనీ, వజ్రా ఎంక్లేవ్, ఓల్డ్ అల్వాల్, మచ్చ బోల్లారం డివిజన్లలో గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు, కరెంటు చార్జీలు, బస్సు టికెట్స్ ధరలు, మెడిసిన్ ధరల పెంపుదలపై నిరసన చేపట్టారు.
మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఆధ్వర్యంలో..
గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. జిల్లెలగూడ చౌరస్తాలో మీర్పేట్ సిలిండర్లతో ధర్నా నిర్వహించారు. కుత్బుల్లాపూర్, నాచారం, వనస్థలిపురం, ఉప్పల్, ఎల్బీనగర్, కూకట్‌పల్లితోపాటు గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ నిరసన చేపట్టారు.