Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వార్ధపూరిత ఆలోచనా విధానం పెరగటం ఆందోళనకం
- ఆధునీకరణ పోకడల వైపు సమాజం : ప్రముఖ కవి, రచయిత్రి తిరునగరి దేవకీదేవి
- ఆశించడం లేకపోతే శ్రమించడం ఉండదు
- చెడును కొన్ని సమూహాలకు అంటగట్టడం దుర్మార్గం : కె.ఆనందాచారి
- తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచీకరణతో ప్రతిదీ వ్యాపార వస్తువు అయిపోయిందనీ, చివరకు ప్రకృతిలో విరివిగా దొరికే వేపపువ్వునూ కొనాల్సిన దుస్థితి నెలకొందని ప్రముఖ కవి, రచయిత్రి తిరునగరి దేవకీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు విధానాలు, మారుతున్న సంవత్సరాలు, ఉగాదులూ సామాన్యుల జీవితాల్లో ఉషస్సులను తీసుకురాలేకపోతున్నాయనీ, ప్రజలే చైతన్యమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గ్రామాల్లో వ్యవసాయ దెబ్బతిందనీ, నగరాలేమో కాంక్రీట్ జంగిల్‌గా మారాయని వాపోయారు. ఉగాది పచ్చడిలో కలిపే వేపుపువ్వు, మామిడికాయ, చివరకు అందులో వాడే నీళ్లు కూడా కొనుక్కోవాల్సి రావడం బాధాకరమన్నారు. గతంలో అయితే ఇరుగుపొరుగువారు ఒకరికొకరు సహకరించుకునేవారనీ, ఇప్పుడు ఎవరి ఇండ్లలో వారుంటుడటంతో అప్యాయతలు, అనుబంధాలు కనుమరుగు అవుతున్నాయని వాపోయారు. మనిషిలో స్వార్ధపూరిత ఆలోచనా విధానం పెరుగుతూ పోతున్నకొద్దీ ప్రతిదీ వ్యాపారమైపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రెండు, మూడు ఫోన్లు ఉంటున్నాయన్నారు. మనం తినే తిండికంటే ఆ సిమ్ల బ్యాలెన్స్ వేయించడం కోసం ఎక్కువ ఖర్చుపెడుతున్న తీరును కండ్లకు కట్టినట్టు వివరించారు. ఓవైపు నాసిరకం విత్తనాలు, ఇంకోవైపు కల్తీ ఎరువులు, అతివృష్టి, అనావృష్టిలు అన్నదాతను ఆగం చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లోనే రియల్ఎస్టేట్ వ్యాపారం రైతులను తామంట తామే భూములను అమ్ముకునేలా చేస్తున్న తీరును వివరించారు. ఇటు వ్యవసాయం, అటు ప్రకృతి విధ్వంసాలకు పాల్పడుతూ మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నామని చెప్పారు. రోజురోజుకీ నిత్యావసరాలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ పెరిగిపోతున్నాయనీ, ఏ ప్రభుత్వాలైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టేవిగానే ఉంటున్నాయని తెలిపారు. ప్రత్నామ్నాయ ఆలోచనలతో ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి మాట్లాడుతూ..ఉగాది కవుల పండుగ అనీ, వారంతా భవిష్యత్‌లో ప్రజలకు శుభం కలగాలని ఆకాంక్షిస్తారని తెలిపారు. రైతులు పంట దిగుబడి పెరగాలనీ, పంటకు మంచి ధర రావాలని ఆశిస్తారన్నారు. ఆశించడం లేకపోతే శ్రమించడం ఉండదని చెప్పారు. దుర్మార్గం, రాక్షతత్వం, దృష్టత్వం, కోపం సమాజంలో ఉండటం సహజమనీ, అయితే, వాటిని కొన్ని సమూహాలకు అంటగట్టడం దుర్మార్గమని అన్నారు. మంచితనం ఎక్కువ పాళ్లలో ఉంది కాబట్టే దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే సాంప్రదాయం నేటికీ కొనసాగుతున్నదన్నారు. అయితే, దాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికల రుతువు అయిపోయిందనీ..ధరల రుతువు ప్రారంభమైందని చెప్పారు. వేతనాలు రోజురోజుకీ తగ్గుతున్నాయనీ, అదే సమయంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజం సమైక్యంగా ముందుకు సాగుతూ పాలకుల విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం కవులు తమ కవితలను చదివి వినించారు.
ఆలోచింపజేసిన కవి సమ్మేళనం
కె.శాంతారామ్ తన 'ఏకీరాస్తా' కవిత ద్వారా ప్రస్తుత తెలంగాణలోని పరిస్థితులను, అన్నదాతలు, నేతన్న ఆత్మహత్యల తీరును కండ్లకు కట్టినట్టు చూపెట్టారు. వెంకట సత్యమూర్తి 'సర్వం ప్రపంచాన్ని గుప్పిట పట్టిన మహారాణి' అంటూ సోషల్ మీడియా కవిత ద్వారా అసత్యప్రచారాలు జరుగుతున్న తీరును వివరించారు. యువకవి విప్లవశ్రీ 'ముగింపు లేని వాక్యం' కవిత ద్వారా ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆగేదెన్నడో? సమాజం మారెదేన్నడో? అంటూ ప్రశ్నించారు. సీతాలక్ష్మి 'తన మారిన పల్లె' కవిత ద్వారా గ్రామీణ భారతంలో చోటుచేసుకుంటున్న మార్పులను వివరించారు. డాక్టర్ నాగేశ్వర్రావు తన 'కోకిల పాట' కవిత ద్వారా ప్రపంచీకరణలో భాగంగా వచ్చిన మార్పులతోకోకిలమ్మ జంటకు ప్రశాంతత, స్వేచ్ఛలేని వైనాన్ని చూపెట్టారు. 'ఎదురుతిరగాలి' అనే కవిత ద్వారా దగదగ మండుతున్న ధరలు...చిధ్రమవుతున్న బతుకులు...ఏమైందీ ప్రజల పౌరుషం? అంటూ ప్రజలను చైతన్యపరుస్తూ తట్టిలేపారు. అబ్దుల్‌రషీద్, పి.సురేంద్ర, వెంకటనారాయణ, కామేశ్వరరావు, ముజాహిద్దీన్ తదితరులు తమ కవితలను వినిపించారు. ఈ కార్యక్రమానికి సాహితీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి అధ్యక్షత వహించగా కవి సమ్మేళనానికి నస్రీన్‌ఖాన్, జి.నరేశ్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సలీమ, ముజాహిద్, తదితరులు పాల్గొన్నారు.