Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువపెంపుతోనే
- ప్రతి నెలా సగటున రూ.1000 కోట్లు
- ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.15,600 కోట్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర సర్కారు రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరం మొదట్లో కరోనా, లాక్డౌన్, ధరణిలో లోపాలు, ఇతరత్రా కారణాల వల్ల మొదటి మూడు నెలలు ఆదాయం అంతంతగానే వచ్చింది. ఆ తర్వాత ప్రతి నెలా పెరుగుతూ పోయింది. రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల మార్కెట్ విలువతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలను ఏరియాను బట్టి 30 శాతం నుంచి 50 శాతం వరకు ఈ ఏడాది జూలైలో పెంచిన విషయం తెలిసిందే. భూముల విలువ పెంచక ముందు రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రతి నెలా సగటున రూ.500 కోట్లకు మించి ఆదాయం రాకపోయేది. మార్కెట్ విలువ, ఛార్జీలను పెంచిన తర్వాత ఆ శాఖ ఆదాయం గతంతో పోలిస్తే రెట్టింపు అయింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవాలని రాష్ట్ర సర్కారు అంచనా వేసుకున్న విషయం తెలిసిందే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ద్వారా రికార్డు స్థాయిలో రూ.10 వేల కోట్ల ఆదాయం సమకూరగా, ధరణి ద్వారా మరో రూ.2 వేల కోట్ల రాబడి వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదలయ్యాక మొదటి మూడు నెలలు ఆదాయం అంతంతమాత్రంగానే వచ్చినప్పటికీ.. ఆ తర్వాత జూలై నుంచి పుంజుకుంది. రిజిస్ట్రేషన్ల చార్జీలు, భూముల మార్కెట్ విలువల పెంపు ప్రభుత్వానికి కలిసొచ్చింది. ప్రతి ఏటా రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.15,600 కోట్ల రాబడిని సమకూర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నది.
నెల స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం (రూ.కోట్లలో)
ఏప్రిల్ 582
మే 138
జూన్ 630
జూలై 991
ఆగస్టు 775
సెప్టెంబర్ 888
అక్టోబర్ 823
నవంబర్ 950
డిసెంబర్ 1052
జనవరిలో 1141
ఫిబ్రవరిలో 898
మార్చి 1090