Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20-30శాతం అధిక ఫీజుల దోపీడీకి తెరలేపిన యాజమాన్యాలు
- అప్పులు చేయాల్సిన దుస్థితిలో తల్లిదండ్రులు
- ఫీ రెగ్యులేషన్ చట్టాల్లో రాజస్థాన్, ఏపీ విధానం ఉత్తమం
- 18న రాష్ట్రవ్యాప్త ధర్నాకు రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణలో ప్రయివేటు కార్పొరేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీల ఫీజులను నియంత్రించే చట్టం తేవాలని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్(టీపీఏ), టెక్నికల్ కాలేజీల అధ్యాపక సంఘం, బాలల హక్కుల పరిరక్షణ వేదిక, ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీపీఏ రాష్ట్ర అధ్యక్షులు నాగటి నారాయణ అధ్యక్షతన రౌండ్ టెబుల్ సమావేశం జరిగింది. ప్రయివేటు కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల సమస్య తీవ్రతపై టీపీఏ అధ్యక్షులు నాగటి నారాయణ, కార్యదర్శి విజయకుమార్, టీఎస్టీసీఈఏ అధ్యక్షులు సంతోష్ కుమార్, సీఆర్పీఎఫ్ కన్వీనర్ వేణుగోపాల్, వీ.వీ.రావు, మదర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భాగ్యలక్ష్మి, నర్సిరెడ్డి, లక్ష్మీనారాయణ, నరేశ్, పురుషోత్తం తదితరులు చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫీ రెగ్యులేషన్ చట్టం చేయకపోవడం వల్ల ప్రయివేటు, కార్పొరేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు 20-30శాతం ఫీజులు పెంచాలని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవటం లేదా అప్పులపాలు కావడం జరుగుతుందని అన్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి వెంటనే చట్టం చేయాలని లేదా ఆర్డినెన్స్ తెచ్చి అధిక ఫీజులను అరికట్టాలని డిమాండ్ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న ఫీ రెగ్యులేషన్ చట్టాల్లో రాజస్థాన్ చట్టం ఉత్తమంగా ఉందనీ, ఏపీలోనూ ఇదే విధానాన్ని చేసిందని గుర్తుచేశారు. రాజస్థాన్ మాదిరిగా రాష్ట్రస్థాయి కమిటీ ఆధ్వర్యంలో మూడేండ్లకు ఓసారి ఫీజులు నిర్ణయించే విధంగా చట్టం చేయాలని, ఉన్నత, ప్రొఫెషనల్ కోర్సులకు టీఏఎఫ్ఆర్సీ ఫీజులు ఫిక్స్ చేస్తున్నట్టే స్కూల్స్, జూనియర్ కాలేజీల ఫీజులు ఫిక్స్ చేయాలని అన్నారు. ప్రతి ఏటా పది శాతం చొప్పున ఫీజులు పెంచుకోవచ్చనే తిరుపతిరావు కమిటీ సిఫార్సును పరిగణలోకి తీసుకోవద్దన్నారు. స్కూల్ లెవల్ కమిటీలకు ఫీజులు నిర్ణయించే అవకాశమిస్తే అది యాజమాన్యాలకు వరంగా.. తల్లిదండ్రులకు శాపంగా మారుతుందన్నారు.
చట్టం చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నందున నిరసనగా వివిధ రకాలుగా ఆందోళనలు చేయాలని సమావేశం నిర్ణయించిందన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం చేయాలనే డిమాండ్ చేస్తూ ఈనెల 18న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. దానికి ముందు రాష్ట్రమంతటా తల్లిదండ్రుల నుంచి సంతకాలు సేకరించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు అందించాలని, విద్యాశాఖ మంత్రికి, క్యాబినెట్ సబ్ కమిటీలోని మంత్రులకు ట్విట్టర్ క్యాంపైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులు, విద్యారంగ శ్రేయోభిలాషులు ఈ పోరాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.