Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ బదిలీ, ఇద్దరు డాక్టర్లు సస్పెన్షన్కు గురికావడం మరోసారి రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ముగ్గురు డాక్టర్లపై ఒకే రోజు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం వైద్యవర్గాల్లో ఆందోళనకు నెలకొన్నది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రశ్నిస్తూ డాక్టర్లు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నల వర్షం కురిపించారు. ముగ్గురిపై చర్యలతో ఎలుకలు పారిపోతాయా? అని ప్రశ్నించారు. ముందుగా ప్రభుత్వం చేయాల్సింది రోగుల సంరక్షకులు, నర్సులు, డాక్టర్ల సంఖ్యను తగినంతగా పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన అని అభిప్రాయపడ్డారు. నిబంధనల ప్రకారం రోగుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో పేషెంట్ కేర్, నర్సింగ్ సిబ్బంది ఉన్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది, పరికరాల కొరత కారణంగా తలెత్తుతున్న సమస్యలకు ఎవరో ఒకరు బలిపశువుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వాస్పత్రుల్లో లోపాలను డాక్టర్లు బహిర్గతం చేయడమే పరిష్కారమని సూచించారు.