Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్నేహితులకు అలవాటు చేస్తున్న నిందితులు
- అదనపు సీపీ డీఎస్ చౌహాన్
- మూడు ముఠాల అరెస్ట్
- డ్రగ్స్‌తో యువకుడు మృతి
నవతెలంగాణ-సిటీబ్యూరో/ బేగంపేట్
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. జూబ్లీహిల్స్, నల్లకుంట, సికింద్రాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మూడు గ్యాంగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు బానిసైన యువకుడు చికిత్స పొందుతూ చనిపోయిన విషయం ఆలస్యంగా
వెలుగులోకొచ్చింది. డ్రగ్స్‌కు అలవాటైన వారు స్నేహితులకు సైతం నేర్పిస్తున్నారని, ఇది ఎంతో ప్రమాదకరమని అదనపు సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఒక్కసారి డ్రగ్స్‌కు అలవాటైతే తిరిగి వెనక్కు రాలేరన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గురువారం హైదరాబాద్ నగర కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు డ్రగ్స్ విక్రేతలతోపాటు వినియోగిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2.2లక్షల ఎల్ఎస్డీ, హాష్ ఆయిల్, డీఎటీ డ్రగ్స్ సహా మత్తు పదార్థాలను తయారు చేస్తున్న పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో డీసీపీ చక్రవర్తి, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, నల్లకుంట ఇన్స్పెక్టర్ రవి, ఇన్స్పెక్టర్ రాజేశ్ పాల్గొన్నారు.
కెమికల్స్‌తో సొంతంగా డ్రగ్స్ తయారీ
కొండాపూర్‌కు చెందిన కె.శ్రీరామ్, సికింద్రాబాద్‌కు చెందిన (ఓ కంపెనీలో కస్టమర్ సర్వీస్‌లో) ఎస్.దీపక్‌కుమార్‌తో చేతులు కలిపాడు. గోవా, హిమాలయాలకు వెళ్లి డ్రగ్స్ వినియోగించేవారు. ఆ తర్వాత సొంతంగా డ్రగ్స్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. డీఎంటీ డ్రగ్‌ను డెవలప్ చేశారు. కెమికల్స్‌తో తయారు చేసి నగరంలో తెలిసిన వారికి, స్నేహితులకు గ్రాము రూ.8 వేలకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, హైదరాబాద్ నార్కోటెక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌తో కలిసి ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి 8 గ్రాముల డీఎంటీ డ్రగ్స్‌తోపాటు తయారీ పరికరాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నల్లకుంటలో మరో ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శివంరోడ్డులో నివాసముంటున్న ప్రేమ్ ఉపాధ్యారు గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ను విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న హెచ్ఎన్ఈడబ్ల్యూ బృందాలు, నల్లకుంట పోలీసులతో కలిసి ప్రేమ్ ఉపాధ్యారుతోపాటు డ్రగ్స్ వినియోగిస్తున్న రామకృష్ణ, నిఖిల్ జోష్, జీవన్ రెడ్డిని అరెస్టు చేశారు.
డ్రగ్స్‌కు బానిసై... ఓవర్ డోస్‌తో మృతి
డ్రగ్స్‌కు బానిసైన హైదరాబాద్ యువకుడు మృతిచెందాడు. మాదక ద్రవ్యాలు తీసుకోవడంతో 23 ఏండ్ల యువకుడు కోమాలోకి వెళ్లాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడ్రోజుల కిందట చనిపోయాడు. యువకుడు గోవా వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంజినీరింగ్ చదివే సమయంలో స్నేహితులతో కలిసి మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మేవాడని అదనపు సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. డ్రగ్స్‌కు బానిసైన యువకుడు ఒక్క డ్రగ్ కాకుండా ఎల్ఎస్డీ, కొకైన్, హాష్, ఎండీఎంఏ ఇలా పలు రకాల డ్రగ్స్ వినియోగించాడు. ఓవర్ డోస్ అయిపోయింది. నరాలు వీక్ అయ్యాయి. లేవలేని స్థితికి వెళ్లాడు. దాంతో రెండు వారాల కిందట కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మూడ్రోజుల కిందటే మృతిచెందాడని అదనపు సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు.
నార్త్‌జోన్‌లో నలుగురు అరెస్ట్
డ్రగ్స్ ముఠాలో భాగమైన నలుగురు నిందితులను అరెస్టు చేశామని, ఇందులో వియ్రించేవారు ఇద్దరు, కొనుగోలు చేసేవారు ఇద్దరు ఉన్నారని నార్త్ జోన్ డీసీపీ దీప్తి చందనా దీప్తి తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో నిందితుల నుంచి 25 గ్రాముల హాష్ ఆయిల్, 2 సెల్ఫోన్లు, బైకు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అరెస్టు అయిన వారిలో రమేశ్ (21), సాయి ప్రకాశ్(19) డ్రగ్స్ అమ్మకందారులని, సాయి కుమార్, నవీన్ కుమార్ వినియోగదారులని చెప్పారు.