Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోగి కాళ్లు, వేళ్లు కొరికిన వైనం
- సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం
- సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు
- గతంలో సూపరింటెండెంట్‌గా పని చేసిన చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు
- ఇద్దరు వైద్యుల సస్పెన్షన్
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ ఎంజీఎం ఆర్ఐసీయూలో ఎలుకలు కలకలం సృష్టించాయి. సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చికిత్స పొందుతున్న రోగి కాలు, చేతిని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సీరియస్ అయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించి.. సూపరింటెండెంట్‌ను బదిలీ చేశారు. గతంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని రోజులు ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందినా తగ్గకపోగా.. ఆయనకు శ్వాస తీసుకోవడంలో సమస్య రావడంతో ఈనెల 27న ఎంజీఎంలో చేర్చారు. ఆర్ఐసీయూలో ఉంచి వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే, బుధవారం రాత్రి శ్రీనివాస్ కుడిచేయి వేళ్లను ఎలుకలు కొరికాయి. వెంటనే కుటుంబసభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో కట్టు కట్టారు. గురువారం ఉదయానికి ఎడమ చేయితో పాటు కాలి వేళ్లు, మడిమ వద్ద కూడా ఎలుకలు కొరకడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. దీనిపై కుటుంబసభ్యులు ఆందోళన చెంది విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వరంగల్ అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకొని ఆర్‌ఐసీయూలోని బాధితుడిని పరిశీలించారు. అధికారులను తీవ్రంగా మందలించారు. దీనిపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, చికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించడం లేదని సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు చెప్పారు. ఆర్ఐసీయూ పురాతన భవనంలో ఉండటం వల్ల ఎలుకల బెడద ఉండి ఉంటుందన్నారు. ఆర్ఐసీయూ పక్కనే వంటగది ఉండటం ఒక కారణం కావచ్చని చెప్పుకొచ్చారు. అయితే, సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు
ఎంజీఎం ఘటనను ప్రభుత్వం వెంటనే సీరియస్‌గా తీసుకుంది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు తక్షణం నివేదిక రూపంలో పంపించాలని, రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దాంతో వైద్యారోగ్య శాఖ అధికారులు, వివిధ విభాగాధిపతులు ఆర్ఐసీయు, ఆస్పత్రి ప్రాంగణం అంతా పరిశీలించారు. ఘటనకు కారణాలను ఆరా తీసిన విచారణ అధికారులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించారు. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావును బదిలీ చేయడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేసింది. గతంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.
అడుగడుగునా నిర్లక్ష్యం
ఎంజీఎం ఆస్పత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎలుకల దాడి జరిగిన భవనం ఎమర్జెన్సీ విభాగం పై అంతస్తులో ఉంటుంది. ఎంజీఎం సూపరింటెండెంట్ చెప్పినట్టుగా పురాతనమైనది కాదు. ఈ భవనం నిర్మించి రెండు దశాబ్దాలు కూడా పూర్తి కాలేదు. బిల్డింగ్‌కు ఎటువంటి కన్నాలూ లేవు. అయినప్పటికీ ఎలుకలు ఎలా వస్తున్నాయి వాటిని ఎలా నిర్మూలించాలని పట్టించుకునే నాధుడే లేడు. పోలీస్ అవుట్ పోస్ట్ వెనుక వైపున ఆర్ఐసీయులోని మూత్రశాలల నుంచి కిందికి వచ్చే పైపుల వద్ద ఎలుకలు భారీ కన్నాలు చేశాయి. వాటిని పూడ్చకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.