Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు హెచ్చరిక
- మండుతున్న ఎండలు
- తీవ్రంగా వడగాల్పులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మండుతున్న ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు సూచించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని గుర్తుచేశారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ ఆరు జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్‌లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 2015లో వడదెబ్బతో మరణాలు ఎక్కువగా సంభవించాయని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. అందుకనుగుణంగా ఎవరికి వారు దినచర్యను రూపొందించుకోవాలని సూచించారు. ఆ సమయంలో బయటికి వస్తే వడదెబ్బకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే రక్షణ చర్యలు తీసుకోవాలనీ, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలని కోరారు.. చెమట రాకపోవడం, నాలుక ఎండిపోవడం, పెదాలు పగిలిపోవడం, నీరసంగా ఉండటం, తలనొప్పి, వికారంగా ఉండటం, గుండెదడ, మూత్రం రాకపోవడమనేది వడదెబ్బ లక్షణాలని శ్రీనివాస్ రావు తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని వెంటనే దగ్గర్లోని చల్లని ప్రాంతానికి తీసుకెళ్లి పానీయాలు ఇస్తూ గాలి బాగా తగిలేటట్టు చూడాలన్నారు. అప్పటికీ కుదుట పడకపోతే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యం అందిస్తే వడదెబ్బ నుంచి బయటపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు, జర్నలిస్టులు, వైద్యులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కలుషితం లేని నీటిని మాత్రమే తీసుకోవాలని శ్రీనివాస రావు చెప్పారు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మసాలాలు తీసుకోవద్దని సూచించారు.
ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో..
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామని శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు. వద్ధులు, పిల్లలతో పాటు గర్భిణిలు జాగ్రత్తగా ఉండాలన్నారు..గర్భిణిలు ఆస్పత్రులకు వెళ్లాలనుకుంటే ఉదయం, సాయంత్రం వేళల్లోనే వెళ్లాలని ఆయన సూచించారు.
కరోనా పూర్తిగా పోలేదు... భయపడాల్సిన అవసరమూ లేదు
రాష్ట్రంలో కరోనా పూర్తిగా తొలిగిపోలేదనీ, అలాగనీ భయపడాల్సిన అవసరమూ లేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటికే 20 జిల్లాల్లో కేసుల సంఖ్య జీరోకు చేరిందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం రోజువారీగా దాదాపు 20 చొప్పున కేసులొస్తున్నాయన్నారు. కేంద్రం ఇప్పటికే ఒక్క మాస్కు ధరించడం మినహా అన్ని నిబంధనలను ఎత్తేసిందని గుర్తుచేశారు. కరోనా విషయంలో ఇప్పటికే రాష్ట్రం ఎండమిక్ స్టేజీ (కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే వ్యాధి)కి చేరుకుందని తెలిపారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలనీ, జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లే వారు కచ్చితంగా మాస్కు ధరించాలని సూచించారు.
వ్యాక్సిన్ రియాక్షన్లు లేవు...
రాష్ట్రంలో ఎక్కడా వ్యాక్సిన్ వికటించిన కేసులు నమోదు కాలేదని డీహెచ్ స్పష్టం చేశారు. 15 నుంచి 17 ఏండ్ల వయస్సు వారికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావచ్చిందని చెప్పారు. 12 నుంచి 14 ఏండ్ల వయస్సు వారిలో 54 శాతం మందికి పూర్తయిందన్నారు. వ్యాక్సిన్ వికటించటంతో బాలుడు చనిపోయాడంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. ఆ బాలుడు బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయాడని స్పష్టం చేశారు.