Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవాళికి పనికొచ్చేది హేతువాదం
- బీజేపీ నాయకులు చెప్పేది 'హేటు'వాదం
- అబద్ధపు ప్రచారాలతో కొనసాగుతున్న పాలన
- ఎస్వీకే వెబినార్‌లో ప్రొఫెసర్ దేవరాజు మహారాజు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత్‌ను హిందూ దేశంగా మార్చడమే విద్య కాషాయీకరణ లక్ష్యమని కేంద్ర సాహిత్య అకాడమి గ్రహీత, ప్రొఫెసర్ దేవరాజు మహారాజు చెప్పారు. విద్య కార్పొరేటీకరణ అంటే ఈ దేశాన్ని, విద్యారంగాన్ని విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పగించడమేనని అన్నారు. విద్య కేంద్రీకరణ అంటే బీజేపీ గుప్పిట్లోనే ఆ రంగం ఉండాలన్న అభిప్రాయముందన్నారు. 'విద్య కాషాయీకరణ దేని కోసం'అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో గురువారం వెబినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన వక్తగా మాట్లాడుతూ విద్య కాషాయీకరణ, హిందూదేశంగా మార్చడమనే ప్రయత్నాలు అయిదారేండ్ల నుంచి కాకుండా స్వాతంత్య్రానికి ముందు నుంచి జరుగుతున్నాయని వివరించారు. అందులో హేతుబద్ధత లేదన్నారు. మూఢత్వం మాత్రమే ఉందని చెప్పారు. సర్వ మానవాళికి పనికొచ్చేది హేతువాదమని అన్నారు. కానీ బీజేపీ నాయకులు 'హేటు'వాదం (శత్రువులుగా చూడడం) గురించి చెప్తున్నారని విమర్శించారు. విద్య కాషాయీకరణలో భాగంగా ఆరు నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను ప్రవేశపెడుతున్నట్టు గుజరాత్ మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. ఈ దేశాన్ని 300 ఏండ్ల వెనక్కి తీసుకెళ్లడానికి ఇలాంటివి చేస్తున్నారని చెప్పారు. విద్యావంతులు మూర్ఖుల్లా, మూఢవిశ్వాసాలతో వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిగ్రీలు ముఖ్యం కాదనీ, విజ్ఞానం ప్రధానమని అన్నారు. ప్రతి ఒక్కరూ సైన్స్, కామన్‌సెన్స్‌తో ఆలోచించాలని సూచించారు. పురాణాల్లో రాముడు, రావణుడు కల్పిత పాత్రలని అన్నారు. అసంబద్ధ ప్రకటనలతో బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఏది నిజమో, ఏది అబద్ధమో ప్రజలు ఆలోచించాలని కోరారు. గతంలో తెలుగువాచకంలోనే మతపరమైన అంశాలుండేవని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సోషల్ స్టడీస్, సైన్స్ సబ్జెక్టుల్లోనూ అవి ఉంటున్నాయని వివరించారు. వినాయకుడికి ప్లాస్టిక్ సర్జరీ జరిగిందంటూ ప్రధానమంత్రి మోడీ వంటి వారు ప్రసంగిస్తున్నారని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో విశ్వానికి సంబంధించిన పరిజ్ఞానం తెలుసుకోవాలని అన్నారు. జ్యోతిష్యం, మూఢత్వం పెంచే పాఠ్యాంశాలను చేర్చడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకుపోదామా?, పురాణాల స్ఫూర్తితో ముందుకుపోదామా?అని ప్రశ్నించారు. తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలతోపాటు హిందూ దేవాలయాలను ముస్లిం రాజులతోపాటు ఈ దేశంలోని హిందూ రాజులు దాడి చేసి ఆస్తులను దోచుకున్నారని వివరించారు. కశ్మీర్‌ఫైల్స్ సినిమాను చూడాలని ప్రధానిస్థాయి వ్యక్తి చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.
వ్యాపారం కోసం కాకుండా ఆ సినిమా ద్వారా వచ్చే డబ్బును కశ్మీర్ పండితుల పునరావాసానికి వినయోగించాలంటూ చెప్పిన కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ నాయకులు దాడి చేశారని చెప్పారు. అబద్ధాలతో, అర్ధసత్యాలతో కశ్మీర్‌ఫైల్స్ సినిమా తీశారని విమర్శించారు. కిసాన్ఫైల్స్, గుజరాత్ఫైల్స్, ఢిల్లీఫైల్స్, సీఏఏ ఫైల్స్, డీమానిటైజేషన్ ఫైల్స్ వంటి సినిమాలు తీయాల్సిన అవసరముందన్నారు. ప్రజాబలం ముందు ఎంతటి నియంత అయినా నిలబడలేరని అన్నారు. రైతులు అచంచల విశ్వాసంతో చేసిన ఉద్యమానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగిరాకతప్పలేదని గుర్తు చేశారు. వివేకం ముందు మూర్ఖత్వం నిలబడలేదని చెప్పారు. జై శ్రీరాం అంటూ నినాదాలిస్తే దేశభక్తులు కాబోరని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే అన్నారని గుర్తు చేశారు. భారత్ ఎప్పటికీ విశ్వగురు కాదు, కాలేదన్నారు. పూజల వల్ల, శ్లోకాల వల్ల మనుషులను బతికించలేమని అన్నారు. వైద్య విజ్ఞానమే మనుషులను బతికిస్తుందన్నారు. అబద్ధపు ప్రచారాలతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారనీ, యువకులు హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారని చెప్పారు. భక్తి ఎంత ఉంటే ఇమ్యూనిటీ అంత పెరుగుతుందని చినజీయర్ స్వామి వ్యాఖ్యానించిన దేవరాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహాభక్తులైన ఆయన కరోనాకు భయపడి మాస్క్ ఎందుకు వేసుకున్నారనీ, వ్యాక్సిన్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. శాస్త్రీయ విద్యావిధానాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.