Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-నంగునూరు
57 ఏండ్ల వయస్సు నిండిన అర్హులకు ఏప్రిల్‌లో ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయనుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఈజీఎస్, సీఎస్ఆర్ నిధులు రూ.2 కోట్లతో నిర్మించిన పాడి పశువుల హాస్టల్, పాల సేకరణ, రూ.22 లక్షలతో నూతనంగా నిర్మించిన క్లస్టర్ రైతు వేదిక, ఓపెన్ జిమ్, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టీల్ బ్యాంక్‌తో పాటు పలు అభివృద్ధి పనులను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులై ఉండి పింఛన్ రానివారికీ మంజూరు చేస్తామన్నారు. కొత్త పింఛన్ డబ్బులను మే 1 నుంచి లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే నిమిత్తం ఏర్పాటుచేసిన స్టీల్ బ్యాంక్‌ను అందరూ వినియోగించుకోవాలని కోరారు. వచ్చే వారం రోజుల్లో అభయ హస్తం లబ్దిదారులకు సంబంధించిన డబ్బులను మిత్తితో సహా ప్రభుత్వం చెల్లించనుందని తెలిపారు. ఉగాది పండుగ తర్వాత సొంత జాగాలో ఇండ్ల నిర్మాణం చేసుకునే లబ్దిదారులకు ప్రభుత్వం మూడు కిస్తుల కింద రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయనుందన్నారు.
ప్రజల నోట్లో మట్టి కొట్టి పాదయాత్రలా..?
మట్టి పనుల్లో రూ.25 వేల కోట్ల కోత పెట్టి ప్రజల నోట్లో మట్టి కొట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు నిలదీయకుండా పాదయాత్రలా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణకు ఈజీఎస్ కింద కూలీల పనిదినాలను రూ.3 వేల కోట్లు తగ్గించడంపై కేంద్రాన్ని ప్రశ్నించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సూచించారు. కూలీలపై ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్టు రాష్ట్రంలో పని దినాలను 13 వేల కోట్ల నుంచి 16 వేల కోట్లకు పెంచేలా చూడాలని సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర నాయకులు పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో స్పష్టత ఇచ్చాకే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్ పెంచకుండా తొక్కి పెట్టినందుకా, వడ్లు కొననందుకా, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా, వంట గ్యాస్ ధర మంట పెట్టినందుకా.. నిరుద్యోగులకు జాబ్‌లు ఇవ్వనందుకా, ఎరువుల ధరలు విపరీతంగా పెంచినందుకా.. అని ప్రశ్నించారు. పెంచేటోడు బీజేపీ వాడైతే.. పంచేవారు టీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. ఎవరు కావాలో.. ప్రజలే తెల్చు కోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తడిసిన ఉమ, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ రాగుల సారయ్య, సొసైటీ చైర్మెన్లు వెల్లంకి మహిపాల్ రెడ్డి, కోల రమేష్‌గౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బద్దిపడగ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.