Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం అమ్మకాలు షురూ
- నిజామాబాద్‌లో క్విింటాకు రూ.1400
- ప్రభుత్వ కొనుగోలుపై స్పష్టత కరువు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వడ్ల రాజకీయం
నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రబీ సీజన్ ధాన్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై స్పష్టత లేకపోవడంతో రైతులు వ్యాపారులకు అగ్గువకు అమ్ముకుంటున్నారు. రబీ సీజన్లో ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.1940 ప్రకటించగా.. నిజామాబాద్ జిల్లాలో మాత్రం రైతులు రూ.1400-రూ.1450కే విక్రయిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేపట్టకుండా పరస్పర విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీసే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉండగా.. రైతులు బలవుతున్నారు. ఇప్పటికే వర్ని, చందూరు మండలాల్లో అమ్మకాలు జరుగుతుండగా.. బోధన్ ప్రాంతంలో కోతలు షురూ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని ముందుగానే ప్రకటించడంతో ఇదే అదునుగా వ్యాపారులు, దళారులు రంగంలోకి దిగారు. అతి తక్కువ ధరకు రైతు నుంచి కొనుగోలు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో రబీ సీజన్లో సాధారణ విస్తీర్ణం 2,64,087 ఎకరాలు కాగా.. 3,49,898 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సీజన్లో మొత్తం 4,77,472 ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. 73 శాతం వరి సాగైంది. ఎస్సారెస్పీతో పాటు నిజాంసాగర్‌లో నిండుగా నీరు ఉండటంతో పంటలకు నీటి కొరత ఏర్పడలేదు. రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 9.5 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది 2020-21 సీజన్లో 438 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 7,49,076 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. గతేడాది పది లక్షల టన్నుల దిగుబడి రాగా.. సుమారు 7.5 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అయితే, ఈ యేడాది 9.5 లక్షల టన్నుల దిగుబడిలో 2.5 లక్షల టన్నులు వాణిజ్య, స్థానిక అవసరాలకు పోను.. మిగిలిన ఏడు లక్షల టన్నుల ధాన్యం సేకరించేది ఎవరన్నది తేలడం లేదు. ప్రతియేటా కొనుగోలుకు ముందు వ్యవసాయ, పౌరసరఫరాలు, మిల్లర్లతో జాయింట్ కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి కొనుగోళ్లకు సంబంధించి సమీక్ష నిర్వహించేవారు. కానీ ఈ యేడు ఇప్పటి వరకు అలాంటి సమావేశమేమీ జరగలేదు.
వ్యాపారులకు అమ్మకాలు..
వర్ని, చందూరు తదితర మండలాల్లో రైతులు రబీ ధాన్యం అమ్మకాలు ప్రారంభించారు. ప్రస్తుతం క్వింటా ధాన్యం రూ.1400-రూ.1450 పలుకుతోంది. కోతలు ప్రారంభ దశలో ఉండటంతో ఈ మాత్రం ధర లభిస్తోందని, మోస్రా, రెంజల్, కోటగిరి తదితర మండలాల్లోనూ కోతలు ప్రారంభిస్తే ఈ ధర మరింత పతనం అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బోధన్‌లో వరి కోతలు ప్రారంభించారు. హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన వరి కోత మిషన్లతో రైతులు వరి కోతలు షురూ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప కొనుగోళ్లపై మాట మాట్లాడ్డం లేదు.
కొనుగోలు కేంద్రాలపై సమాచారం లేదు: గోవింద్- జిల్లా వ్యవసాయాధికారి
రబీ సీజన్లో జిల్లాలో 9.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖగా అంచనా వేశాం. గతడాదితో పోల్చితే ఈ యేడాది 50 వేల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు.
దళారులకు అమ్ముకుంటున్నాం : రవి(భవానీపేట్- బోధన్)
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత లేదు. రోజుకొక మాట చెబుతున్నారు. ఎండలు మండుతున్నాయి. పంట కోయకపోతే గింజ ఎండిపోయి దిగుబడి తగ్గుతుంది. కోసిన తరువాత కూడా రెండు, మూడు రోజుల్లో పంట ఎండుతది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై నిర్దిష్టమైన సమయం ప్రకటిస్తే వేచి చూడొచ్చు. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రకటనలు రాలేదు. అందుకే బయట దళారులకు అమ్ముకుంటున్నాం. క్వింటాకు రూ.1400-1500 చెల్లిస్తున్నారు.