Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటిఫికేషన్‌ను విడుదల చేసిన టీఎస్సీహెచ్ఈ చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) చైర్మెన్ ఆర్ లింబాద్రి శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈనెల ఆరో తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా జూన్ ఆరో తేదీ వరకు వాటిని సమర్పించేందుకు అవకాశముందని పేర్కొన్నారు. మూడేండ్లు, ఐదేండ్ల లా కోర్సులకు ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు రూ.500, ఇతరులు రూ.800 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కోరారు. ఎల్ఎల్ఎంకు ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు రూ.800, ఇతరులు రూ.వెయ్యి ఫీజు కట్టాలని వివరించారు. ఆలస్య రుసుం రూ.500తో జూన్ 26 వరకు, రూ.వెయ్యితో జులై ఐదు, రూ.రెండు వేలతో 12వ తేదీ వరకు చెల్లించొచ్చని తెలిపారు. జులై ఐదు నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశముందని సూచించారు. మూడేండ్ల లా కోర్సును జులై 21న, ఐదేండ్ల లా కోర్సు, ఎల్ఎల్ఎంను 22న నిర్వహిస్తామని వివరించారు. లాసెట్‌ను రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రాంతీయ కేంద్రాల్లోని 60 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాతపరీక్షల తర్వాత లాసెట్ ప్రాథమిక కీని విడుదల చేస్తామని తెలిపారు. ఇతర వివరాలకు https://lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైఎస్ చైర్మెన్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఓయూ వీసీ డి రవీందర్, కేయూ వీసీ టి రమేష్, ఎంజీయూ వీసీ సిహెచ్ గోపాల్‌రెడ్డి, లాసెట్ కన్వీనర్ జీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.