Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలి
- ఐసీడీఎస్ అధికారుల వేధింపులు దారుణం : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల ప్రాజెక్టు పరిధిలోని బాలానగర్ మండలం మోతీ ఘణ్‌పూర్ తండాలో అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి ఐసీడీఎస్ అధికారుల వేధింపులతో చనిపోయిందనీ, దీనికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ ఎస్వీ రమ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
విజయలక్ష్మి మృతికి సంతాపాన్ని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సెలవులున్నప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సెంటర్లోనే ఉండాలనీ, ఆదివారం కూడా సెంటర్‌కు రావాలని ఒత్తిడి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. వేసవి సెలవులు కదా అని నిరాకరించిన టీచర్లకు ఐసీడీఎస్ అధికారులు మెమోలు జారీ చేస్తూ, తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీలపై పని ఒత్తిడి తగ్గించాలనీ, ఐసిడిఎస్ అధికారులు సెంటర్ల తనిఖీ పేరుతో మానసిక వేధింపులకు గురిచేయడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. విజయలక్ష్మి మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.