Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్నేహంగా ఉంటా... కానీ బలహీనురాలిని కాను
- అహంకారని అంతకంటే కాను....శక్తిమంతురాలిని
- ఆహ్వానాన్ని మన్నించిన వారికి కృతజ్ఞతలు
- ఉగాది వేడుకల్లో గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''నేను స్నేహంగా ఉంటాను. అలా అని బలహీనురాలిని కాను. అహంకారిని కాను. అత్యంత శక్తిమంతురాలిని. రాజ్ భవన్ పరిమితులు నాకు తెలుసు. అయినా సరే.... ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చే నెల నుంచి ప్రజా దర్భార్ క్రమం తప్పకుండా ఉంటుంది. నేటి నుంచి తెలంగాణకు కొత్త శకం మొదలు కానున్నది.... '' ఈ మాటలు అన్నది ఎవరో కాదు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్లోని రాజ్భవన్లో నిర్వహించిన ముందస్తు వేడుకల్లో ఆమె పరోక్షంగా టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె తెలుగులో ప్రసంగం మొదలెడుతూ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖల నుంచి రాజ్ భవన్ సిబ్బంది వరకు అందర్నీ వేడుకకు ఆహ్వానించాననీ, తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారికీ కృతజ్ఞతలంటూ పలుమార్లు తెలిపారు. ప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. వారి నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించి అవసరాలను అంచనా వేసేందుకు ఒక ప్రత్యేక బృందం నిరంతరాయంగా పని చేస్తూనే ఉందన్నారు. ఈ ఏర్పాటు ప్రజల కోసం రాజ్ భవన్ అందిస్తున్న చిన్నపాటి ప్రేమ అని అభివర్ణించారు. అభివృద్ధి కోసం తాము పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ వేడుకలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. పుదుచ్ఛేరి నుంచి ఆహ్వానితులు వచ్చేందుకు వీలుగా నేరుగా విమాన సౌకర్యం కోసం సహకరించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రికి గవర్నర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను రాజ్భవన్లో గవర్నర్ గా కాకుండా తెలంగాణ సోదరిగా కూర్చున్నానని తెలిపారు. ప్రజలకు సాయమందించేందుకు తవ చేతులెప్పుడూ సిద్ధంగా ఉంటాయన్నారు.
వేడుకలకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు, టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, ఐఏఎస్ అధికారులు జయేష్ రంజన్, నదీం అహ్మద్, శాలినీ మిశ్రా, టీఎస్ఈఆర్సీ చైర్మెన్ శ్రీరంగారావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రముఖ జ్యోతిష్యుడితో పంచాంగ పఠనం గావించారు.