Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు అభినందనలు తెలిపిన సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీస్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 28.6 శాతం వృద్ధిని సాధించింది. రికార్డు స్థాయిలో రూ.26 వేల కోట్ల టర్నోవర్ జరిగింది. 2021-22తో పోల్చితే బొగ్గు రవాణాలో 35.1 శాతం, ఓవర్ బర్డెన్ తొలగింపులో 20.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సందర్భంగా సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ కార్మికులకు అభినందనలు తెలిపారు. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉత్పత్తిని సాధించిందని ఆయన వివరించారు. మార్చి 31వ తేదీతో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సర ఫలితాలను శుక్రవారంనాడొక ప్రకటన ద్వారా ఆయన వెల్లడించారు. సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ద్వారా రూ.130 కోట్ల విద్యుత్ ఖర్చులు ఆదా చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం 127.9 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ జెన్కోకు 66.69 లక్షల టన్నులు, వివిధ రాష్ట్రాల్లోని16 ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాలకు 218.87 లక్షల టన్నులు, కర్నాటక పవర్ కార్పోరేషన్‌కు 82 లక్షల టన్నులు, తమిళనాడు జెన్కోకు 25.71 లక్షల టన్నులు, మహారాష్ట్ర జెన్కోకు 29.79 లక్షల టన్నులు సరఫరా చేసినట్టు వివరించారు. వీటితో పాటు సిమెంటు, సిరమిక్సు, పేపర్, స్పాంజ్ ఐరన్ ఇతర పరిశ్రమలకు 118.79 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేశామన్నారు. బొగ్గుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఐదు కొత్త గనులను ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించోతున్నామన్నారు. ఒడిస్సాలోని నైనీ బ్లాకు నుంచి ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుందనీ, 2022-23లో 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల స్థాయి నుంచి1500 మెగావాట్ల స్థాయికి కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.