Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిత్యావసర వస్తవుల ధరలను తగ్గించకపోతే ఉధృత పోరాటాలు: డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్
నవతెలంగాణ- ఖమ్మం
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వమే నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ సెంటర్లను నిర్వహించాలని, ప్రకటించిన నోటిఫికేషన్లకు ఏడు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అన్నారు. నిత్యావసర వస్తవుల ధరలను తగ్గించకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం నగరంలోని సుందరయ్య భవన్లో డీవైఎఫ్ఐ సమావేశం జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రకటించిన 1,91,136 ఖాళీల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేవలం ఎనభై వేల పోస్టులకే నోటిఫికేషన్లు ఇవ్వడం నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని అన్నారు. తెలంగాణ యువత ఆకాంక్షలను నీరుగార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను మోడీ ప్రభుత్వం పెంచడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు కేసీఆర్ కరెంట్ చార్జీలను పెంచి విపరీతంగా భారాలు మోపుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేశాక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోచింగ్ సెంటర్లు విపరీతంగా ఫీజులను పెంచుకొని నిరుద్యోగులను దోచుకుంటున్నాయని, వెంటనే ఆ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, జిల్లా సహాయ కార్యదర్సులు చింతల రమేష్, గుమ్మా. ముత్తరావు, దిండు మంగపతి, జిల్లా ఉపాధ్యక్షులు శీలం వీరబాబు, కనతాల వెంకటేశ్వర్లు, సత్తెనపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.