Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యతనివ్వాలి
- అనీమియా ముక్త్
- రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ
- గైనకాలజిస్టులు, ప్రభుత్వ వైద్యులతో విడివిడిగా సమావేశాలు
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ ప్రభుత్వ వైద్యులు, ప్రయివేట్ గైనకాలజిస్టులకు సూచించారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రయివేట్ నర్సింగ్హోమ్ల గైనకాలజిస్టులు, ప్రభుత్వ వైద్యులతో విడివిడిగా నిర్వహించిన సమావేశంల్లో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లీబిడ్డ ఆరోగ్యం దృష్ట్యా, తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే శస్త్ర చికిత్స ద్వారా ప్రసవాలు చేయాలని చెప్పారు. ఇతర కారణాల వల్ల శస్త్ర చికిత్సల జోలికి పోవద్దని సూచించారు. మంచి ముహూర్తం, మంచి రోజు అని పేషెంట్లు కోరితే శస్త్ర చికిత్స ద్వారా ప్రసవాలు చేయొద్దని, సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని సూచిం చారు. కలెక్టర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి, రెండో దోసులను 100 శాతం పూర్తిచేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపామన్నారు. అలాగే, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తామన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో తనిఖీ
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కమిషనర్ వాకాటి కరుణ తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలు, పౌష్టికాహారం తదితర అంశాల గురించి అడిగి తెలుసుకుని సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలోని వివిధ విభాగాలను సందర్శించారు. ఆమె వెంట కలెక్టర్ ఆర్వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నమాల, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ జ్యోతి, మాతా శిశు ఆరోగ్య కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ అలీమ్, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ రెడ్డి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ విప్లవశ్రీ ఉన్నారు.