Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కో కుటుంబంపై పెట్రో, డీజిల్ భారం రెండువేలకుపైనే
- ఆరునెలల్లో నూనె ప్యాకెట్ల రేట్ల పెంపు రూ.70కిపైనే
- ఏడాదిలో పెరిగిన గ్యాస్ బండ ధర రూ.231
- 10 నుంచి 20 శాతం పెరిగిన సబ్బుల ధరలు
- ఉప్పుపైనా రూ.4 పెరుగుదల
దేశంలో రాజకీయంగా ఎన్నికల ఋతువు అయిపోయి...ధరల ఋతువు ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో గమ్ముగా ఉన్న కేంద్రం అయిపోయాగానే ప్రజలపై భారాల విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ గ్రీష్మంలో భానుడితోపాటు నిత్యావసర ధరలూ ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు సెంచరీ దాటి డబుల్ సెంచరీవైపు పరుగులు పెడుతున్నాయి. ఏడాది వ్యవధిలోనే ఒక్కో కుటుంబంపై పెట్రో, డీజిల్ భారం రెండు వేల నుంచి మూడు వేలకు చేరింది. రాష్ట్ర సర్కారూ తానేమీ తక్కువ కాదన్నట్టు విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన మోపింది. బస్సు చార్జీలనూ పెంచేసింది. పెట్రో, డీజిల్ ధరల ఎఫెక్ట్‌తో నిత్యావసర సరుకుల రేట్లూ భగ్గుమంటున్నాయి. ఒక్క టమాట తప్ప అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. మందుగోలీల రేట్లు పైపైకి దూసుకుపోతున్నాయి. భగభగ మండుతున్న ధరలతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు.
నవతెలంగాన బ్యూరో-హైదరాబాద్
కరోనాతో ఓవైపు ఉద్యోగాలు పోయి..మరోవైపు వేతనాల్లో కోతలతో సగటు జీవి సతమతమవుతున్నాడు. రూ.20 వేల వేతనం పొందే చిరుద్యోగి నలుగురు కుటుంబ సభ్యులున్న కుటుంబాన్ని పోషించుకునేందుకు రూ.23 వేల వరకు ఖర్చవుతున్నది. కేంద్రం విధానాలతో ప్రతి నెలా రెండు వేల రూపాయల నుంచి రూ.3 వేల వరకు అప్పు చేసి బతకాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్థిక సమస్యలు కుటుంబాల్లో గొడవలకూ కారణమవుతున్నాయి.
గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీన మన రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.94.16, లీటర్ డీజిల్ రేటు రూ.88.20 ఉంది. ఏడాది వ్యవధిలోనే పెట్రోల్ రేటు రూ.21.24 పెరిగి రూ.115.42కు చేరింది. డీజీల్ ధర దాదాపు 14 రూపాయలు పెరిగి రూ.101.58కి చేరింది. దీంతో ద్విచక్ర వాహన దారులపై ఏటా సగటున రూ.11 వేల భారం అదనంగా పడుతున్నది. దీని ప్రభావం ట్రాన్స్పోర్ట్ రంగంపై పడింది. ముడి సరుకు నుంచి వస్తువుల రవాణా వరకు కీలకంగా ఉండే ఈ రెండింటి ధరల పెరుగుల ప్రభావం నిత్యావసరాలపైనా పడుతున్నది.
రాష్ట్రంలో వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. ఆరు నెలల కింద నూనె ప్యాకెట్ల ధర(లీటర్‌కు) రూ.140 నుంచి రూ.160 ఉన్నది. ప్రస్తుతం మార్కెట్లో లీటర్ సన్‌ప్లవర్ ఆయిల్ రూ.220 అయ్యి కూర్చున్నది. అంటే ఆరునెలల్లో ఒక్కో ప్యాకెట్‌పై సుమారు రూ.70 రూపాయలకు వరకు పెరిగింది. నిత్యావసర సరుకుల ధరలు కూడా రోజురోజుకీ వాటి వెంటే పరుగులు పెడుతున్నాయి. దీంతో ఇటీవలికాలంలో నిత్యావసర సరుకుల ధరలు 20 నుంచి 50 శాతం దాకా పెరిగాయి. 'లైఫ్‌బారు సబ్బు నాలుగు నెలల కింద రూ.27 ఉండేది..ప్రస్తుతం రూ.35 అయింది. సబ్బుల ధరలు ఇప్పటికే బ్రాండ్‌ను బట్టి పది నుంచి 20 శాతం పెరిగాయి. మళ్లీ పెరుగుతాయంట. 95 రూపాయలున్న లైజాల్ డబ్బా రూ.104 అయింది. ఉప్పుమీద కూడా నాలుగైదు రూపాయలు పెరిగింది. డీజిల్ రేటు పెరుగుతుండటంతో ఇంకా ధరలు పెరుగుతాయని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు' అని మన్సూరాబాద్‌కు చెందిన అయ్యప్పసంతోష్ కిరాణం నిర్వాహకుడు సంతోష్ తెలిపారు. చపాతీ చేసుకునే గోధుమపిండి, రవ్వ, మైదాపిండి ధరలు కూడా కేజీకి ఐదారు రూపాయలు పెరిగాయి. కిలో పల్లి ధర కాస్తా రూ.140కి ఎగబాకింది. పప్పుల ధరలూ గతంతో పోల్చుకుంటే రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. రవాణా చార్జీలు పెరగడంతో బ్రెడ్డు కంపెనీలు కూడా ఒక్కో ప్యాకెట్‌పై రూ.5 పెంచేశాయి.
గ్యాస్ బండ భారమే..కరెంట్ షాకే
ప్రజలపై గ్యాస్ భారం అంతా ఇంతా కాదు..గతేడాది ఫిబ్రవరి మాసాంతం చివర్లో గ్యాస్ బండ ధర రూ.771 ఉంది. అదికాస్తా ఏడాదిలోనే రూ.1002కు చేరింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు లేకపోయి ఉంటే ఈ ధర ఇప్పటికే 1500 రూపాయలు దాటేదే. ఐదుగురు కుటుంబ సభ్యులుంటే ఇంట్లో సగటున నెలకో గ్యాస్ పడుతున్నది. సర్కారు తీరు వల్ల ఒక్క ఏడాది వ్యవధిలోనే ప్రతి నెలా గ్యాస్ బండ భారం రూ.231 రూపాయలు పెరిగిదంటే కేంద్రం బాదుడు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చును. ఇప్పటిదాకా వంద యూనిట్లు కరెంటు వాడుకునే గృహ వినియోగదారులకు రూ.232.50 వచ్చేది. పెరిగిన దానితో మే నుంచి రూ.396 రూపాయల కరెంటు బిల్లు రానున్నది. అంటే ఒక్కో సామాన్య కుటుంబంపై సగటున రూ.170 వరకు పడే అవకాశముంది.
07 ఫిబ్రవరి 2021 రూ.771
11 మార్చి 2021 రూ.871
03 ఆగస్టు 2021 రూ.887
05 అక్టోబర్ 2021 రూ.937
26 నవంబర్ 2021 రూ.952
మార్చి 2022 రూ.1002
(ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలలు పెరగలేదు)
కూరగాయలు, ఆకుకూరల ధరలు పైపైకి
రోజురోజుకీ డీజిల్ రేట్లు పైపైకి పోతున్న నేపథ్యంలో సరుకు రవాణా చార్జీలూ పెరిగి కూరగాయల రేట్లు భగభగ మండిపోతున్నాయి. కూరగాయల్లో టమాట ధర మాత్రమే కాస్త తక్కువగా కేజీ రూ.20 ఉంది. తీగలాగే మాదిరిగానే చిక్కుడు పైపైకి ఎగబాకుతూ కేజీ రూ.60 పలుకుతున్నది. దోసకాయ కూడా 40కి చేరింది. బెండకాయ, గోకరకాయ, క్యారెట్..ఇలా ఏ కూరగాయ చూసినా కేజీకి రూ.50కి తక్కువ లేదు. గతంలో ఆకుకూరలు చాలా తక్కువ ధరకే లభించేవి. ఎండలకు తోడు రవాణా చార్జీల పెరుగుదలతో వాటి రేట్లనూ పెంచేశారు. పదికి మూడుకు మించి ఇవ్వట్లేదు.
రూ.20 వేలు వేతనం పొందుతూ అద్దె ఇండ్లల్లో ఉంటున్న చిన్న కుటుంబంపై ప్రతినెలా ఖర్చుల సగటు వివరాలు
సింగిల్ బెడ్ రూమ్ అద్దె 6500 (మెయింటనెన్స్‌తో కలిపి)
పాలు 800
కూరగాయలు 1000
పెట్రోల్ 3000
కిరాణం 5000
బియ్యం బస్తా 1100
వైద్యం ఖర్చులు 1500
నాన్‌వెజ్ కోసం 700
కరెంటు బిల్లు 400
టీవీ రీచార్జి 350
ఇతరత్రాలు 1000