Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెట్ పేపర్-2 సిలబస్‌ను మార్చండి
- 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టండి
- మంత్రి సబితకు ఆర్‌యూపీపీటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న భాషాపండితుల అప్‌గ్రెడేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం (ఆర్‌యూపీపీటీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లో ఆర్‌యూపీపీటీఎస్ అధ్యక్షులు సి జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సిములు నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల దశాబ్ధాల కలను నిజం చేసేందుకు వీలుగా 17,18,15 జీవోలను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. కానీ ఎస్జీటీ ఉపాధ్యాయులు న్యాయస్థానంలో సవాల్ చేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. ప్రభుత్వం పండితుల తరఫున నిలబడి కౌంటర్ దాఖలు చేసిందని వివరించారు. సర్వీస్ రూల్స్‌ను మారుస్తూ భాషా పండితుల కోసం జీవో నెంబర్ 2,3, పీఈటీల కోసం జీవో నెంబర్ 9,10లను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ జీవోలు అమల్లోకి రావాలంటే కోర్టులో ఉన్న కేసులు పరిష్కారం కావాలని పేర్కొన్నారు. అడ్వకేట్ జనరల్‌కు ప్రభుత్వం ఆదేశాలిచ్చి ఈ సమస్యలను త్వరగా పరిష్కరించేలా చూడాలని కోరారు. భాషాపండి తులకు న్యాయం చేయాలని సూచించారు. టెట్ పేపర్-2లో తెలుగు, హిందీ భాషాపండితుల కోసం సిలబస్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. సోషల్, సైన్స్, గణితం సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు ఉండడం వల్ల భాషాపండితులకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. భాషా పండితులకు సంబంధించిన అంశాలనే 60 మార్కుల సిలబస్‌లో ప్రత్యేకంగా చేర్చి టెట్ పేపర్-2ను మార్చాలని సూచించారు. 13 జిల్లాల్లో బ్లాక్ చేసిన భార్యాభర్తల (స్పౌజ్) కేటగిరీ పోస్టులను అన్‌బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయా జిల్లాల్లో స్పౌజ్ అప్పీళ్లను పరిష్కరించకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఆయా జిల్లాల్లోనూ స్పౌజ్ బదిలీలు చేపట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బడేసాబ్, నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.