Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిట్ ఏర్పాటు చేసి విచారణకు చొరవ చూపండి : సీఎం కేసీఆర్‌కు రేవంత్లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ఆందోళన కలిగిస్తున్నదనీ, దీనిపై జాతీయస్థాయి సిట్ ఏర్పాటు చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈమేరకు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌లో తొలి డ్రగ్స్ బాధిత మరణం నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. మూడేండ్లుగా డ్రగ్స్‌కు బానిసైన 23 ఏండ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఆరోగ్యం క్షీణించి, చివరికి తుది శ్వాస విడవడం బాధకరమని తెలిపారు. మొన్న కెల్విన్, నిన్న టోనీ లాంటి డ్రగ్స్ మాఫియా చాపకింద నీరులా నగరాన్ని కేంద్రంగా చేసుకున్నారని విమర్శించారు. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఎన్ని టాస్క్ ఫోర్సులు నియమించినా, ప్రత్యేక అధికారులతో పర్యవేక్షించినా డ్రగ్స్ మాఫియా అంతం కాకపోవడానికి తెర వెనుక రాష్ట్ర ప్రభుత్వం చేష్టలే కారణమని ఆరోపించారు. 2017లో కెల్విన్ అరెస్టు, విచారణ తర్వాత ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పదకొండు మంది ప్రముఖులతో పాటు మొత్తం 60 మందిని విచారించిందని గుర్తు చేశారు. ఆ తర్వాత వారందరికీ క్లీన్చిట్ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ మాఫియా గుట్టు విప్పాలంటే, కేవలం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ విచారణ చేస్తే సరిపోదన్నారు. ఈ కేసును సీబీఐ, ఈడీ, డీఆర్ఐ, ఎన్సీడీ వంటి సంస్థలకు అప్పగించాలని కోరారు. మరింత మంది పిల్లలు బలికాక ముందే స్పందించాలని డిమాండ్ చేశారు. తక్షణం జాతీయ స్థాయి సిట్ ఏర్పాటు చేయించి, విచారణకు అన్ని రకాలుగా సహకరించాలని డిమాండ్ చేశారు. ఆయా సంస్థలు అన్నీ వివరాలు, డిజిటల్ రికార్డులు తక్షణమే అందజేయాలనీ, లేదంటే డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలి దోషిగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సంగిశెట్టి జగదీష్, మెట్టు సాయి కుమార్, కైలాష్ కుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. హైదరాబాద్ విశ్వనగరంగా మారలేదనీ, విషనగరంగా మారిందని విమర్శించారు.
4న రాహుల్‌గాంధీతో మరోసారి సీనియర్ల భేటీ : ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ
రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాహుల్‌గాంధీ సోమవారం ఢిల్లీలో మరోసారి సమావేశం కానున్నారు. ఇప్పటికే సీనియర్ నాయకులందరికీ ఆహ్వానం అందిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. పార్టీ బలోపేతం కోసం అన్ని రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నారని గుర్తు చేశారు. శువ్రారం తనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పార్టీకి నిరుత్సాహాన్ని కలిగించాయన్నారు. తిరిగి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా పార్టీ దృష్టి సారించిందన్నారు. సీనియర్ నేతలు వి హనుమంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఆహ్వానం ఉందని చెప్పారు.
ఇప్లూలో ఓబీసీ రిజర్వేషన్ల అమలు చేయాలి : ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ (ఇఫ్లూ) యూనివర్సిటీలో ఓబీసీ రిజర్వేషన్ల అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లినట్టు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ చెప్పారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం హర్షణీయమన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర విద్యా, ప్రభుత్వరంగ సంస్థల పాలక వర్గాలు 'రూల్ అఫ్ రిజర్వేషన్స్' ఉల్లఘిస్తున్నాయని విమర్శించారు. బీసీలకు రావాల్సిన పదవులన్నీ ఇఫ్లూ అధికారులు హరించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.