Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోగులకు వైద్య సేవలందించాలి
- వైద్యులపై వేటు తాత్కాలిక ఉపశమనమే
- తెలంగాణ పౌర స్పందన వేదిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో వసతులను మెరుగుపర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ పౌర స్పందన వేదిక (టీపీఎస్వీ) డిమాండ్ చేసింది. రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు టీపీఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలోని ఆర్ఐసీయూ వార్డులో రోగిపై ఎలుకలు దాడి చేయడం దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపారు.
ఉత్తర తెలంగాణ ప్రజానీకానికి ప్రధాన ఆరోగ్య కేంద్రంగా ఉన్న ఈ ఆస్పత్రిలో సౌకర్యాలు అత్యంత తక్కువ స్థాయిలో ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. అత్యధిక పరిశుభ్రంగా ఉండాల్సిన ఐసీయూ వార్డులో ఎలుకలు తిరుగుతుండడం విషాకరమని తెలిపారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేస్తే ఎలుకలతో జాగ్రత్తగా ఉండాలంటూ రోగి కుటుంబ సభ్యులకు సూచించడం వైద్యాధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నదని విమర్శించారు. సూపరింటెండెంట్ బదిలీతోపాటు మరో ఇద్దరు డాక్టర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. ఈ చర్యలు ఆస్పత్రిలోని సమస్యలకు తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రి నూతన భవనాలకు శంకుస్థాపన చేసి రెండేండ్లకుపైగా అవుతున్నదని వివరించారు. ఇప్పటిదాకా పనులు ప్రారంభమైన దాఖలా లేదని పేర్కొన్నారు. పనులు మొదలైనా నూతన భవనాలు పూర్తయి, సేవలు అందుబాటులోకి రావడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేమని తెలిపారు. ఈలోపు ఉన్న భవనాలకు వసతుల కల్పన, సిబ్బంది పెంపుదలపై దృష్టి పెట్టి దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐసీయూ వార్డులో ప్రతి బెడ్డుకూ ఒక నర్సు ఉండాలనీ, కానీ ఎంజీఎం ఆర్ఐసీయూ వార్డులో కేవలం ఇద్దరే నర్సులున్నారని వివరించారు. శానిటైజేషన్ సిబ్బంది సరిపోను లేరనీ, కాంట్రాక్టు తీసుకున్న సంస్థ ఒప్పందాని కన్నా తక్కువ మంది పారిశుధ్య కార్మికులను వినియోగిస్తున్నదని పేర్కొన్నారు. తాము నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. సిబ్బంది కొరత, పారిశుధ్య నిర్వహణలో లోపం, నిధుల కొరత మొదలైన మౌలిక సమస్యలను పరిష్కరిస్తే ప్రభుత్వ వైద్యశాలల్లో నాణ్యమైన వైద్య సేవలు ప్రజానీకానికి అందించొచ్చని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో లోపాలను సరిదిద్దే క్రమంలో కేవలం కొందర్ని బాధ్యులను చేసి, క్రమశిక్షణా చర్యలు తీసుకుని చేతులు దులుపేసుకుంటే సరిపోదని తెలిపారు. మౌలిక సమస్యలను పరిష్కరించాలనీ, శాశ్వత పరిష్కారాల దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.