Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాఉద్యమాలు బలోపేతం చేయండి
- జీవో 111 ఎత్తేస్తామనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
- అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశానికి ఫాసిస్టు బీజేపీ ప్రమాదకరమనీ, తెలంగాణలో ఆపార్టీని ప్రతిఘటించాలని సామాజిక వేత్త మేధా పాట్కర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఐక్య ప్రజా ఉద్యమాలను బలపర్చాలని కోరారు. రాజ్యాంగానికి, ప్రజల ఎజెండాకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జవాబుదారీగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలను తిప్పికొట్టాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మేధాపాట్కర్.. మలక్‌పేట్ అఫ్జల్‌నగర్ కమ్యూనిటీ హాల్లో సామాజిక సంస్థలు, ప్రజా సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. అంతకుముందు మలక్‌పేట ప్రాంతంలోని తీగలగూడ బస్తీ నిర్వాసితులను కలిశారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడారు. జీవో 111 ఎత్తివేత నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాలు చేస్తున్న ఉద్యమాలకు సంఘీభావం తెలిపారు. ఇండ్లు కోల్పోయిన పేదలకు పూర్తిస్థాయిలో పునరావాసం, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మూసీనది ప్రాంతంతో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాలను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు పండించే అన్ని పంటలకు మద్దతుధర కల్పించాలనీ, కౌలు రైతులకు న్యాయం చేయాలనీ, హైకోర్టు ఆదేశాల ప్రకారం రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించాలనీ, వారికి కూడా రైతుబంధు అమలు చేయాలని కోరారు. వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు కనీసం 200 రోజుల పని కల్పించడంతోపాటు రోజుకు వేతనం రూ 600 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్లను వెంటనే నియమించాలనీ, అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జీవో 111 రద్దు చేయడం ద్వారా ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుందని మేధా పాట్కర్ చెప్పారు. నిర్దిష్టమైన పట్టణీకరణ ప్రణాళికలు అమలు చేయకపోతే పర్యావరణానికి తీవ్రహాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భజలాలు అడుగంటిపోతాయనీ, భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు హైదరాబాద్ నగరం ముంపునకు గురయ్యే ప్రమాదముందని చెప్పారు. ఈ జీవోను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని కోరారు. పట్టణీకరణ పెరుగుతుండటంతో పట్టణ పేదలను ప్రభుత్వాలు బలవంతంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు జీవనోపాధి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తమ ఇండ్లను అన్యాయంగా
తొలగించారు...స్థానికుల మొర
తమ ఇండ్లను అన్యాయంగా తొలగించారని బస్తీవాసులు ఈసందర్భంగా ఆమె దృష్టికి తీసుకొచ్చారు. 200 కుటుంబాల్లో 140 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారనీ, మిగిలిన 60కుటుంబాలకు పూర్తిస్థాయిలో పునరావాసంతోపాటు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన కుటుంబాలన్నింటికి పునరావాస ప్యాకేజీ అందేలా ఖచ్చితమైన సర్వే నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం నేత ఎస్ జీవన్‌కుమార్, విస్సా కిరణ్, సయ్యద్ బిలాల్, శ్రీధర్ వర్గీస్, మీరా సంఘమిత్ర, లుగ సర్వత్, హైమ, కోండల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.