Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆడిటరైన పీయూష్‌కు రైతుల కష్టాలు ఏం తెలుస్తాయి..?
- బీజేపీ సర్కారును గద్దె దించుతాం: మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటు సాక్షిగా మరోసారి తెలంగాణ రైతులను అవమానించారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలను నూకలు తినాలంటూ వ్యాఖ్యానించటం ద్వారా ఆయన తన అహంకారాన్ని ప్రదర్శించారని విమర్శించారు. ఆడిటర్‌గా పని చేసిన ఆయనకు రైతుల కష్టాలేం తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న గోయల్ వ్యాపారిలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే జె.సురేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డితో కలిసి హరీశ్‌రావు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల కోసం అవసరమైతే నూకలు కూడా తింటాం.. కానీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. మోడీ సర్కారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాల్సింది పోయి.. వ్యయాన్ని రెట్టింపు చేసిందని తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ ఎవరి పక్షమో తెల్చుకోవాలని సవాల్ విసిరారు. పీయూష్ కేంద్ర మంత్రిలా కాకండా కార్పొరేట్ల ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశంలోని బడా బాబులు బ్యాంకులకు రూ.11 లక్షల కోట్లు ఎగ్గొడితే వాటిని మాఫీ చేసిన కేంద్రానికి, తెలంగాణ రైతుల కోసం కేటాయించటానికి డబ్బుల్లేవా..? అని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన క్రమంలో...బాయిల్డ్ రైస్ ఒప్పందాన్ని రద్దు చేసుకోలేరా..? అని ప్రశ్నించారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లను అమర్చితే ఏడాదికి రూ.ఐదు వేల కోట్లను ఇస్తామంటూ కేంద్రం చెబితే సీఎం కేసీఆర్ తిరస్కరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ కోతలున్నాయని తెలిపారు. యాసంగిలో తెలంగాణలో ఉత్పత్తయ్యే మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనకపోతే రైతుల కోపాగ్నికి బీజేపీ గురికాక తప్పదని హెచ్చరించారు.