Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 113 గ్రామాల్లో భూసేకరణ
- ఎన్హెచ్ఏఐ నిర్ణయం
- 158 కిలోమీటర్ల మేర నిర్మాణం
- 14 నుంచి 19కి పెరిగిన మండలాలు
- గెజిట్ నోటిఫికేషన్ జారీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదారాబాద్
రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) తొలి గెజిట్ నోటిఫికేషన్ (3ఎ)కు కేంద్ర ఉపరితల, రవాణా శాఖ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు ఉత్తరభాగం 158 కిలోమీటర్ల మేర నిర్మితం కానుంది. దీనికి సంబంధించిన భూసేకరణ చర్యలు ఈ గెజిట్‌తో వేగవంతం కానున్నాయి. అందుకోసం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది మంది డివిజనల్ స్థాయి ఉన్నతాధికారులతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయగా, అందులో యాదాద్రి-భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌తోపాటు, చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేట ఆర్డీఓలతో కాంపిటెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం వైపు రోడ్డు నిర్మాణంలో భాగంగా 113 గ్రామాల్లో భూసేకరణ చేపడతారని గెజిట్‌లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) పేర్కొంది. ఈ భాగంలో మొత్తం 19 మండలాలు, నాలుగు జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం జరగనుంది. ఆయా ప్రాంతాల్లో భారీ ఇంటర్ ఛేంజర్లను నిర్మించనున్నారు. అయితే, త్వరలో 3ఏ(క్యాపిటల్) గెజిట్ కూడా త్వరలో విడుదల కానున్నట్టు ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. ఇందులో భూసేకరణకు సంబంధించిన భూముల సర్వే నెంబర్ల వివరాలనూ పొందుపరచనున్నారు. ఆతర్వాత గెజిట్ అవార్డు(ప్రాజెక్టు అయ్యే మొత్తం వ్యయం) చేస్తారని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారుల అభిప్రాయంగా ఉంది. అందుకే గెజిట్‌లో మొత్తం ఎంత ఖర్చవుతుందనే విషయాన్ని పేర్కొనలేదని సమాచారం.
19 మండలాలు..113 గ్రామాలు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి తొలి నోటిఫికేషన్ (3ఎ)లో యాదాద్రి-భువనగిరి, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 19 మండలాలు ఉన్నాయి. అందులో అత్యధికంగా యాదాద్రి -భువనగిరి, సిద్ధిపేటతోపాటు సంగారెడ్డి, మెదక్‌లో నాలుగు మండలాల చొప్పున ఉన్నాయి. ఆయా మండలాల్లోని 113 గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరగనుంది. కాగా, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలంలో అత్యధికంగా 15 గ్రామాలుండగా, అదే జిల్లాలో కౌడిపల్లె మండలంలో మాత్రం ఒకే గ్రామం గుండా ఈ రింగురోడ్డు వెళ్ళనుంది. గతంలో ఈ ప్రాజెక్టులో మొత్తం 14 మండలాల నుంచి వెళుతుందని భావించారు. ఆ సంఖ్య ఇప్పుడు 19కి పెరిగింది. ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయని సమాచారం. ఇందుకు మొత్తం 4704.99 ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
అలాగే ఆమోదముద్ర వేసిన ఉత్తరభాగం రోడ్డుకు రానున్న రోజుల్లో ఎనిమిది లైన్లకు విస్తరించేలా 100 మీటర్ల వెడెల్పుతో భూసేకరణ చేసి, ప్రస్తుతానికి నాలుగు వరుసలతోనే నిర్మించనున్నారు. 100 మీటర్ల వెడెల్పుతో ప్రతిపాదిత అలైన్మెంటుకు 4704.99 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు అంటున్నారు.
గిర్మాపూర్ నుంచి చౌటుప్పల్...
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రోడ్డు సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం గిర్మిపూర్ వద్ద ప్రారంభమై మెదక్, సిద్ధిపేటలోని ప్రాంతాలను అనుసంధానిస్తూ యాదాద్రి-భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ చౌటుప్పల్ పట్టణం వద్ద ముగుస్తుందని కేంద్రం గెజిట్‌లో పేర్కొంది. రింగురోడ్డు నిర్మాణానికి కావాల్సిన 4704.99 ఎకరాల భూమిని ఆయా గ్రామాల నుంచి ప్రత్యేక అథారిటీ ద్వారా చేయనున్నట్టు ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణ ప్రసాద్ చెప్పారు.