Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టీల్, సిమెంట్, ముడి సరుకుల ధరలు తగ్గించాలి : సీఐటీయూ, బీసీడబ్ల్యూఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిర్మాణ రంగంలో వాడే స్టీల్, సిమెంట్, ఇతర ముడి సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ ఈ నెల నాలుగో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు నిర్వహించబోయే కన్స్ట్రక్షన్ హాలీడేకు సీఐటీయూ, బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ మద్దతు ప్రకటించాయి. ధరలను నిరసిస్తూ క్రెడారు, ట్రెండా, టీబీఎఫ్, టీబీఏ, రియల్ ఎస్టేట్ సంఘాలు ఈ హాలీడేకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ పిలుపునకు మద్దతు తెలుపుతూ శనివారం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్, బీసీడబ్ల్యూఎప్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగూరు రాములు, ఆర్.కోటంరాజు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. కరోనా అనంతరం పనులు దొరక్క భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నిర్మాణ రంగంలో వాడే ముడిసరుకుల ధరలు పెరగటం మూలంగా సామాన్యులు ఇండ్లు కట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్మికులకు పనులు దొరక్క తీవ్ర ఇబ్బందుల్లోకి కూరుకుపోతున్నారని వాపోయారు. ధరల పెరుగుదల మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా స్టీల్ ధర వంద శాతం, సిమెంట్ ధరలు 50 శాతం, ముడిసరుకుల ధరలు 30 శాతం పెరిగాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. కన్స్ట్రక్షన్ హాలీడే కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మి కులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.