Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్చకుల సమక్షంలో పంచాంగ శ్రవణం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శుభకృత్ నామ సంవత్సరం శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం సంప్రదాయ బద్ధంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 10న స్వామివారి కల్యాణం, 11న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర గోదావరి జాలాలను తీసుకొచ్చారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, 9 రకాల పండ్ల రసాలు, నారికేళ జలాలతో కనుల పండువుగా అభిషేక తిరుమంజనం నిర్వహించారు. ఉగాది పర్వదినం కావటంతో ప్రాంగణమంతా పచ్చనితోరణాలతో అలంకరించారు. రామాలయంలో అర్చకులు వివిధ పూజలు నిర్వహించారు. అనంతరం స్వామికి వేప పూత ప్రసాదం నివేదించారు. తదుపరి అర్చకులు ఈ ప్రసాదాన్ని సందర్శకులకు పంపిణీ చేశారు.
పంచాంగ శ్రవణం :
శుభకృత్ నామ సంవత్సరంలో శనివారం రాత్రి రామాలయంలో నిరాడంబరంగా పంచాంగ శ్రావణం జరిగింది. అనంతరం వేదపండితులు పంచాంగ శ్రవణం చేశారు. స్వామివారికి, అమ్మవారికి ఆలయానికి సంబంధించి ఈ సంవత్సరం దివ్యంగా ఉంటుందని తెలిపారు. స్వామివారికి ఆదాయం 5,వ్యయం 5, సీతమ్మకు ఆదాయం 11,వ్యయం 5ఉంటుందన్నారు. రామయ్యకు రాజ పూజ్యం 5,అవమానం 2, సీతమ్మ కు రాజపూజ్యం 4,అవమానం 5గా ఉన్నాయని వేదపండితులు ప్రకటించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని చెప్పారు.