Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఆబ్కారీ శాఖల నుంచి అత్యధిక రాబడులు
- రూ.94,500 కోట్ల ఆదాయం
- మద్యం అమ్మకాలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపే కారణం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒకవైపు రాష్ట్ర ప్రజానీకం ధరల పెరుగుదలతో అల్లాడిపోతుంటే.. మరోవైపు రాష్ట్ర ఖజానా మాత్రం కాసులతో కళకళలాడిపోతోంది. మార్చి 31తో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదలైన లెక్కలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ యేడాదిలో వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, అబ్కారీ శాఖలు అత్యధికంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చాయి. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వ్యాట్, జీఎస్టీల రాబడి అనూహ్యంగా పెరిగింది. 2020-21లో ఈ రూపంలో రూ.52,436 కోట్ల రాబడి రాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.65వేల కోట్లు వచ్చింది. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 2020-21లో రూ.5,260 కోట్లు వస్తే... 2021-22లో రూ.12,364 కోట్లు ఖజానాకు చేరాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021-22లో ఈ మూడు శాఖల నుంచి రెట్టింపునకు మించి ఆదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్ ఫీజులతోపాటు భూముల మార్కెట్ విలువలు పెంచడంతో రాబడి పెరిగినట్టు స్టాంపులు,రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు వివరించాయి. ఈ మూడు శాఖల నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.94,500 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది అంతకు ముందు ఆర్థిక ఏడాదిలో వచ్చిన మొత్తం కంటే దాదాపు రూ. 23వేల కోట్లు ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు శాఖల ద్వారా వచ్చే ఆదాయం 1.20 లక్షల కోట్లుగా ఉండొచ్చన్నది ప్రభుత్వ అంచనా. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22లో వాణిజ్య పన్నుల శాఖ రూ.13 వేల కోట్ల మేర అధిక రాబడిని సాధించింది. రిజిస్ట్రేషన్ల శాఖ గతానికి భిన్నంగా రికార్డు స్థాయిలో దాదాపు రూ.12వేల కోట్లకుపైగా ఆదాయాన్ని సమకూర్చుకున్నది. అబ్కారీ శాఖలో రూ. 30వేల కోట్లకుపైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇదే సమయంలో ఎక్సైజ్ సుంకం కింద రూ.17వేల కోట్లకుపైగా ఆదాయం ప్రభుత్వా నికి వచ్చింది.అబ్కారీ శాఖ ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.14వేల కోట్ల ఆదాయమొచ్చింది. 2021-22తో పోలిస్తే ఈ ఆదాయం రూ.రూ.3వేల కోట్లు అధికమని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.