Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖచ్చితంగా అమలు చేయాలన్న కేంద్రం
- రెండు సార్లు అటెండెన్స్ పంపాలని అధికారులకు ఆదేశాలు
- మండుటెండలో పనులు కష్టతరం
- పని ప్రదేశంలో మౌలిక వసతులు కరువు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పోతోంది.. ఏటా బడ్జెట్లో నిధుల కోత విధించగా.. వేసవిలో కూలీలకు ఇవ్వాల్సిన వేసవి భత్యాన్ని రద్దు చేసింది. ఈ ఏడాది కొత్తగా మరో మెలిక పెట్టింది. రెండు పూటలా పనులు చేయించాలని.. లేదంటే కూలి చెల్లించడం కుదరదని.. రెండు పూటలా అటెండెన్స్ పంపాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూలీలు ఉదయం పూట ఉపాధి పనులు చేసి, మధ్యాహ్నం ఇతర వ్యవసాయ పనులు చేసుకునే వాళ్లు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఓతో కూలీలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనులు చేయాల్సిందే అని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వేసవిలో పని గంటలు తగ్గించాల్సింది పోయి పని గంటలు పెంచడం పట్ల కూలీలకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిలాల్లో 2 లక్షల 65వేల 352 జాబ్ కార్డులు ఉన్నాయి. 6లక్షల 90వేల 298 మంది కూలీలు ఉన్నారు. ఇందులో ఈ ఏడాది ఉపాధి పనులకు వెళ్లిన వారు 5 లక్షల 30వేల 294 మంది. రంగారెడ్డి జిల్లాలో లక్ష 65 జాబ్ కార్డులు ఉండగా 2 లక్షల మంది కూలీలు పనులకు వెళ్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 87 వేల జాబ్ కార్డులు ఉండగా.. 4 లక్షల మంది కూలీలు ఉన్నారు. నిర్వీరామంగా కూలి పనులు వెళ్లే వారి సంఖ్య లక్ష 20 వేల మంది ఉన్నారు. గతేడాదిలో వంద రోజుల ఉపాధి కల్పనలో రాష్ట్రంలోనే వికారాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. కానీ ప్రస్తుతం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకుని రోజుకో మార్పు తీసుకోవడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో కూడా రెండు పూటలు పని చేయాలని.. లేదంటే కూలి డబ్బులు రావంటూ కేంద్రం అల్టిమేట్ జారీ చేసింది. గతంలో ఉదయం పూట పనిచేసుకుని వచ్చేవాళ్లు. ఇప్పుడు ఖచ్చితంగా రెండు పూటలు చేయాల్సిందే అని కేంద్రం ఆదేశాలు ఇవ్వడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు.
వేసవి భత్యానికి మంగళం
ఎండకాలంలో పనులు చేసే కూలీలకు వేసవి భత్యం కింద మూడు నెలల పాటు సగటున 25 శాతం వేతనం అదనంగా చెల్లించాలి. అయితే, కేంద్రం వేసవి భత్యాన్ని ఎగ్గొట్టింది. కూలీలు చేసిన పని కొలతల ఆధారంగా లెక్కించి రోజుకు రూ.257 వేతనం చెల్లించాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాలుగైదు గంటల పాటు కష్టపడుతున్నా సగటు కూలి రూ.150 నుంచి రూ.190 మాత్రమే వస్తోంది. ప్రస్తుతం ఎండలు భగ్గుమంటుండంతో నేలలు గట్టిబారి ఎంత కష్టపడినా వేతనం గిట్టుబాటు కావడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. గతంలో మాదిరిగా వేసవి భత్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
రెండు పూటల అటెండెన్స్
ఉపాధి పనులు వేసవిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుండేవి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జాబ్ కార్డు కలిగిన కూలీలు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధిగా పనులకు హాజరు కావాలి. ఎంత మంది పనులకు వచ్చారనే విషయాన్ని ఉపాధి హామీ మేట్లు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం మరోసారి మాస్టర్లో నమోదు చేయాలి. గ్రామం నుంచి పని ప్రదేశాలకు సుమారు రెండు, మూడు కిలోమీటర్ల ఉండటంతో రోజులో నాలుగు సార్లు తిరగాల్సి ఉంటుంది. కూలీలు అటు,ఇటూ తిరగలేక పని ప్రదేశాల్లోనే ఉండాల్సి వస్తోంది.ఎండల తీవ్రత దృష్టా ఉదయం 7 గంట ల నుంచి సాయంత్రం5గంటల వరకు అక్కడే ఉండటం సాధ్యంకాని పరిస్థితి. గతంలో ఉదయం పనికెళ్లి ఎండ పెరిగే సమయానికి తిరిగి వచ్చేవారు. ప్రస్తుతం కేంద్ర ప్రభు త్వం తీసుకున్న నిర్ణయంతో కూలీలు పొద్దంతా పని ప్రదేశా ల్లోనే ఉండాల్సి వస్తోంది.ఇదిలా ఉంటే..పని ప్రదేశాల్లో కూలీలకు కనీస వసతులు కూడా కల్పించడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జీఓను వెంటనే వెనక్కి తీసుకుని, గతంలో లాగే పనులు చేయించాలని కూలీలు డిమాండ్ చేశారు.
కేంద్ర నిబంధనలు పాటిస్తున్నాం
ఉపాధి హామీ పనులు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఇక నుంచి రెండు పూటలు పని చేయాలి. అప్పుడే కూలీల ఖాతాల్లో పూర్తి డబ్బులు జమ అవుతాయి. కొత్త నిబంధన వల్ల భవిష్యత్తులో కూలీల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
- ప్రభాకర్
రంగారెడ్డి జిల్లా డీఆర్డీఏ పీడీ